జర్నలిస్టులు సమాజ నిర్దేశకులు..

జర్నలిస్టులు సమాజ నిర్దేశకులని, సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వ్యాఖ్యానించారు

Update: 2024-03-10 16:04 GMT

దిశ, సూర్యాపేట: జర్నలిస్టులు సమాజ నిర్దేశకులని, సమాజంలో వారి పాత్ర ఎంతో కీలకమని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ వ్యాఖ్యానించారు. జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీసుకున్న జర్నలిస్టుల వృత్తి కత్తి మీద సాము లాంటిది అన్నారు. తెలంగాణ యాదవ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ విధంగా మాట్లాడారు. ఫోర్త్ ఎస్టేట్‌గా పరిగణిస్తున్న జర్నలిస్టులు వృత్తి నైపుణ్యంలో చెడు మార్గాలను ఎంచుకోవద్దన్నారు. తమ జీవితాలను తాకట్టు పెట్టి వృత్తి పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతున్న వారికి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలపాలన్నారు. సిరా చుక్కతో పదాలను సమూహంగా ఏర్పరిచి వారు మేల్కొల్పే విధానాన్ని అభినందించారు.

అదేవిధంగా రాజకీయ నాయకులకు సైతం జర్నలిస్టులు తమ సూచనలు సలహాలను ఇచ్చి అండగా నిలవాలన్నారు. యాదవ జర్నలిస్టులంతా ఐక్యంగా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతుగా అందజేస్తామని తెలిపారు. గొర్రెల మేకల ఫెడరేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ… యాదవ్ జర్నలిస్టులంతా ఒక్కతాటిపైకి వచ్చి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో జర్నలిస్టుల పాత్ర మరచిపోలేనిది అన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు కుటుంబాన్ని సైతం వదిలేసి సమాజ శ్రేయస్సు కోసం ముందుకెళ్లినా విషయాలను గుర్తు చేశారు. వారి నోటి వెంట వచ్చిన ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుందని ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం ముఖ్య అతిథులను షీల్డ్ ఇచ్చి శాలువాలతో సత్కరించడం జరిగింది.యాదవ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన జిల్లాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, యాదవ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్, మేకల కృష్ణ కో- కన్వీనర్‌, శెట్టి హరికృష్ణ యాదవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు దోతి నాగరాజు యాదవ్, జిల్లా నాయకులు రావుల రాజు యాదవ్, లొడంగి వెంకటేష్ యాదవ్, దుబ్బాక నరేష్ యాదవ్‌,మెండే వెంకన్న యాదవ్‌, పాక జహంగీర్ పాల్గొన్నారు.


Similar News