జిల్లా వ్యాప్తంగా 250కి పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లు
ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ తెలిపారు.
దిశ, నేరేడుచర్ల (పాలకవీడు ) : ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 250కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ తెలిపారు. సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో రైతులు సన్న రకం ధాన్యం అత్యధికంగా పండిస్తున్నారని, ఈసారి రూ. 2300 కు బోనస్ గా రూ.500 కలిపి రైతు ఖాతాల్లో వేస్తారని పేర్కొన్నారు. మంగళవారం పాలకవీడు మండల కేంద్రంలోని పీహెచ్ సీ, తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పీహెచ్సీ ని సందర్శించి ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ మంజూరు చేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఓపీ, సిబ్బంది రిజిస్టర్లను పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. వాటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. త్వరలో డాక్టర్ ను నియమించి పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామన్నారు.
తహసీల్దార్ కార్యాలయంను సందర్శించి రికార్డ్ లు పరిశీలించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తాగునీరు, కరెంట్ సమస్యలు ఉంటే దసరా సెలవులు పూర్తవ్వగానే నివేదిక అందించాలని ఎంఈఓని ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఆర్డీఓ ఆధ్వర్యంలో ఎమ్మార్వో, ఎంఏఓ, ఏపీఎం, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పాలకవీడు మండల వ్యాప్తంగా 17 వేల ఎకరాలకు 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు.
అవసరమైతే ధాన్యం కొనుగోలు సెంటర్లను పెంచుతామన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించి ఆలస్యం చేయకుండా వెంటనే డబ్బులు చెల్లించాలని సూచించారు. కొత్తతండా గ్రామంలో మరుగుదొడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపీపీ గోపాల్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే గతంలో రైల్వే లైన్ కింద భూములు కోల్పోయిన వారందరికీ పరిహారం సక్రమంగా అందించలేదని బాధితులు తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారి శంకర్, ఎంపీడీఓ లక్ష్మి, తహసీల్దార్ కమలాకర్, ఎంఈఓ కాటయ్య, మండల వ్యవసాయ అధికారి కల్యాణ చక్రవర్తి, ఎంఎల్ హెచ్పీ అంజలి, ఏపీఓ రాజు, ఏపీఎం అనురాధ, సూపర్ వైజర్ ధనమ్మ, ఆర్ ఐ లు నర్సయ్య, సైదా, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు.