Disha effect : కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
దిశ పత్రికలో వచ్చిన కథనానికి సాగర్ ఎమ్మెల్యే స్పందించారు... నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల
దిశ, తిరుమలగిరి (సాగర్) : దిశ పత్రికలో వచ్చిన కథనానికి సాగర్ ఎమ్మెల్యే స్పందించారు... నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులను మంగళవారం స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలో కస్తూర్బా నిర్మాణ పనులు సంవత్సరాలు గడుస్తున్నా త్వరితగతిన పూర్తి చేయకపోవడంతో ఈ నెల 10వ తారీకున దిశ పత్రిక "నాలుగేళ్లుగా నత్తనడకే... " అనే శీర్షికన నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా పాఠశాల భవన నిర్మాణం పై కథనం ప్రచురించింది. దీంతో స్థానిక శాసనసభ్యులు జైవీర్ రెడ్డి కస్తూర్బా పాఠశాల నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో స్థానిక నాయకుల ద్వారా ఆరా తీశారు. నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవన నిర్మాణం నిర్లక్ష్య రీతిలో కొనసాగుతుందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
కాంట్రాక్టర్ లోపభూయిష్టంగా క్వాలిటీ లేని నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. మూడంతస్తుల బిల్డింగ్ కు ఇటుకలు ఇదే ప్రాంగణంలో తయారు చేశారని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. భవన నిర్మాణం పై డిఈ, జేఈ ల పర్యవేక్షణ లేదన్నారు. దీంతో ఎమ్మెల్యే డీఈ తో అక్కడే మాట్లాడారు.. నెల రోజుల్లో బిల్డింగ్ పనులు పూర్తిగా సిద్ధం చేయాలని ఆదేశించారు. నెలరోజుల అనంతరం మరోసారి భవన నిర్మాణం పర్యవేక్షిస్తానని తెలిపారు. అంతకుముందు ఆరు బయట చెట్ల కింద విద్యార్థినీలకు విద్య బోధన జరుగుతుండడంతో ప్రస్తుతం నడుస్తున్న కిరాయి బిల్డింగ్ గదులను ఆయన పరిశీలించారు.
విద్యార్థినీలు చదువుతున్న తీరును గమనించారు. విద్యార్థినీలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. మెనూ ప్రకారం సరైన క్రమంలో భోజనాలు అందిస్తున్నారా అని విద్యార్దినీలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినీలతో మమేకమై వారితో కలిసి భోజనం చేశారు.ఆయన వెంట ఎంఈఓ తరి. రాము, మండల పార్టీ అధ్యక్షులు రమావత్. కృష్ణా నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కాసాని. చంద్రశేఖర్, స్థానిక మాజీ సర్పంచ్ శాగం. శ్రవణ్ కుమార్ రెడ్డి, శాగం. నాగిరెడ్డి, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్, ఆవుల నాసర్ రెడ్డి, కస్తూర్బా కవిత, మత్స్య సహకార సంఘం చైర్మన్ పిట్టల కృష్ణ, పగడాల సైదులు యాదవ్, లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.