రేపు మధ్యాహ్న భోజనం పరిశీలన
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న 658 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరును రేపు జిల్లా అధికారులు, జిల్లా ప్రత్యేక అధికారులు,మండల అధికారులు పరిశీలించనున్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్న 658 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరును రేపు జిల్లా అధికారులు, జిల్లా ప్రత్యేక అధికారులు,మండల అధికారులు పరిశీలించనున్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు వంట చేస్తున్న విధానాన్ని పర్యవేక్షణ చేయడం,మంచినీరు, వంట పాత్రలు, పరిసర ప్రాంతాలు, నాణ్యత ప్రమాణాలు పాటించడం జరుగుతుందా లేదా అనే పరిశీలించనున్నారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కమిటీ పర్యవేక్షించడం జరుగుతుందా,వండిన వంటను రుచి చూసి విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందా అని పరిశీలించనున్నారు. అనంతరం రెసిడెన్షియల్ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, హాస్టల్లో చదువుతున్న పిల్లలకు, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో..విద్యార్థులకు హెల్త్ చెకప్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. డాక్టర్స్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, స్క్రీనింగ్ అనంతరం విద్యార్థులకు ఏమైనా పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటే హాస్పటల్ కు రిఫర్ చేయనున్నారు. జిల్లాలో 85 హాస్టల్స్ లో రాత్రి నిద్రలో భాగంగా జిల్లా అధికారులు,ప్రత్యేక అధికారులు, మండల అధికారులు హాస్టల్ కు వెళ్లి..రోజు వారి మెనూ చార్టును పరిశీలించనున్నారు. నాణ్యత ప్రమాణాల అంశం,పరిసరాల శుభ్రత అంశాలను పరిశీలించనున్నారు.అధికారులకు కేటాయించిన హాస్టల్స్ లలో రాత్రి నిద్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, రెవిన్యూ జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కలెక్టర్, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, ప్రత్యేక అధికారులు, మండల అధికారులు సోమవారం రోజు సాయంత్రం వారికి కేటాయించిన హాస్టల్స్ లో రాత్రి నిద్ర చేయడం జరుగుతుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.