మీ సేవకునిగా ఉంటా..మరొకసారి ఆశీర్వదించండి
రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
దిశ, నూతనకల్: రాష్ట్రంలో అన్ని కులాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పీఎసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మిర్యాలతో పాటు లింగంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, నాడు అరాచక రాజకీయం ఉండేదని, నేడు శాంతియుత వాతావరణం ఉందని, గత పది సంవత్సరాలుగా ఎలాంటి దాడులు, ప్రతిదాడులు, హత్య రాజకీయాలు లేవని కేవలం అభివృద్ధి మాత్రమే ఉందఅన్నారు. బీడు భూములుగా ఉన్న వ్యవసాయ భూములు, నేడు సస్యశ్యామలంగా పచ్చటి పైర్లతో కళకళలాడుతున్నాయన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలే కాకుండా పెట్టని పథకాలు సైతం అమలు చేసిన సీఎం కేసీఆర్ పాలన మరో మారు రావాలని అందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజల అభివృద్దే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని అన్నారు. ప్రతి పక్షాలు మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తాయని, వాటిని నమ్మొద్దన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ముచ్చటగా మూడోసారి ఆశీర్వదిస్తే మీ సేవకునిగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూరెడ్డి కళావతి, జెడ్పీటీసీ దామోదర్ రెడ్డి, జిల్లా రైతు కో ఆర్డినేటర్ రజాక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య, కార్యదర్శి సాయిలు గౌడ్, సర్పంచి గోరుగంటి ఉష మోహన్ రావు, నాయకులు సంజీవరెడ్డి, తిరుమలరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.