ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన వరద..

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలం లో వాగులు,

Update: 2024-09-01 09:52 GMT

దిశ, నడిగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలం లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిచేయని మొబైల్ సిగ్నల్స్, నిలిచిన విద్యుత్ సరఫరాతో అసౌకర్యానికి గురవుతున్న ప్రజానీకం... మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం, చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ ఎడమ కాలువ కట్ట పై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో కట్టకు కోత గురయ్యే ప్రమాదం లేకపోలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపి వేయాలని కోరుతున్నారు. 50 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని గ్రామస్థులు తెలుపుతున్నారు. క్రమంగా నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో సమీప ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

అదేవిధంగా సూర్యాపేట , ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామంగా వున్న ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న పాలేరు వాగులో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీరు సుమారు ఇరవై మీటర్ల మేరకు ముందుకు చేరింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నడిగూడెం మండల కేంద్రంలోని చౌదరి చెరువు అలుగు పోయడంతో గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలకు నీరు వచ్చి చేరింది, కేఆర్సీ పురం వెళ్లే రహదారిపై పూర్తిగా నీటితో నిండిపోయింది. సారంగేశ్వర చెరువు పొర్లి పోతుండటంతో రామాపురం వెళ్ళు మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. రత్నవరం గ్రామం వెలుపల గల లో లెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి వెళ్లే మార్గం అధికారులు మూసివేశారు. చాకిరాల వద్ద సాగర్ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువ కట్టపై కి ఎవరు వెళ్లకుండా పోలీసులు పహారా చేస్తున్నారు.












Similar News