ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్..?

ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు

Update: 2025-03-29 01:53 GMT
ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్..?
  • whatsapp icon

దిశ,సంస్థాన్ నారాయణపురం : ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ భూములను కబ్జా పెడుతూ ఇతరులకు అమ్మకాలు కూడా ప్రారంభించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తూతూ మంత్రంగా సర్వే చేసి వదిలేస్తున్నారు. ఇలాంటి సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. సర్వే నెంబరు 238,239 లో గల ప్రభుత్వ భూమిలో దర్జాగా ఫెన్సింగ్ వేసి గేటు ని ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూమిలో గేటు ఏర్పాటు!

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 238,239 లో దేవరగట్టు భూములు ఉన్నాయి. అయితే దీని పక్కనే ఆనుకుని ఉన్న ఓ రైతు సుమారు 30 గుంటల ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ వేసి మరి గేటును ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా సదరు భూమిని ఇతర వ్యక్తికి అమ్మి ప్రభుత్వ భూమిలోనే పొజిషన్ చూపించడంతో కొనుగోలు చేసిన రైతు కూడా తన భూమి అంటూ వాదిస్తున్నాడు. అసలు కొనుగోలు చేసిన రైతు సర్వేనెంబర్ 237 కాగా ప్రభుత్వ సర్వే నెంబర్లు అయినా 238,239 లో ఫెన్సింగ్ వేసి గేటును ఏర్పాటు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు.

సర్వే చేసి వదిలేసిన అధికారులు!

స్థానికుల ఫిర్యాదు మేరకు తహశీల్దార్ 238,239 సర్వే నెంబర్లను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తేల్చారు. కానీ దగ్గర ఉండి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అదేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో స్థానికులు అంతా ఏకమై సర్వేయర్ చూపించిన హద్దుల ప్రకారం కడిలను నాటారు. కానీ రాత్రికి రాత్రే కొనుగోలు చేసిన రైతు ఆ కడీలను విరగొట్టి ముక్కలు ముక్కలుగా చేసి పడేశాడు.

తహశీల్దార్ మాటలతో విస్తుపోయిన స్థానికులు!

ప్రభుత్వ సర్వేయర్ నిర్దేశించిన హద్దుల ప్రకారం ప్రకారం స్థానికులు నాటిన కడీలను రైతు కూల్చివేయడం పై తహశీల్దార్ కు సమాచారం ఇచ్చారు. అయితే దీనిపై స్పందించిన తహశీల్దార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి అంటూ గ్రామస్తులకే తెలపడంతో వారు అవాక్కయ్యారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన తహశీల్దార్ తమను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయమని చెప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రభుత్వ భూమిని పరిరక్షించడంలో తహశీల్దార్ ఎందుకు చురుకుగా వ్యవహరించడం లేదో అర్థం కావడం లేదని అంటున్నారు. కబ్జాదారులు తహశీల్దార్ కుమ్మక్కై ప్రభుత్వ భూమి పరిరక్షించడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే స్థానిక అవసరాల కోసం ప్రభుత్వ భూమి ఎక్కడ లభించకపోవడంతో ఉన్న భూమిని కాపాడుకునేందుకు అధికారులు సహకరించకపోవడం శోచనీయమని స్థానికులు అంటున్నారు.

ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పెన్సింగ్ వేసుకున్నాడు :కే. బుచ్చి రెడ్డి,మహమ్మదాబాద్ గ్రామస్తుడు.

దేవరగట్టు సమీపంలోని సర్వే నెంబరు 238,239 లో 30 గుంటల భూమిని కబ్జా చేసి పెన్సింగ్ వేసుకున్నాడు. దీనిపై తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన సర్వే చేసి వదిలేశాడు. గ్రామస్తులందరూ కలిసి కడీలు నాటితే రాత్రికి రాత్రి కబ్జా చేసిన రైతు విరగొట్టాడు. దీంతో తహశీల్దార్ కు సమాచారం అందిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని మాకే చెప్పాడు. అసలు కబ్జా చేసిన వారిపై తహశీల్దార్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు.

సర్వే చేశాము హద్దు రాళ్లు నాటుతాం: ఎం.కృష్ణ తహశీల్దార్,సంస్థాన్ నారాయణపురం.

మహమ్మదాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 238,239 పూర్తీగా ప్రభుత్వ భూమి ఉన్నది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు మాకు సమాచారం అందింది. సర్వేయర్ తో సర్వే చేశాం హద్దు రాళ్లు నాటి, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం.

Similar News