అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.

Update: 2024-10-24 10:30 GMT

 దిశ సూర్యాపేట కలెక్టరేట్ :- మెరుగైన జీవితాలను అందించేందుకు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. గురువారం అయన సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో..జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. జిల్లాకు వచ్చిన గవర్నర్ కు ముందుగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర గవర్నర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయ ఆవరణలో.. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా అధికారులు, ప్రముఖులతో సమావేశ మందిరంలో ముఖాముఖి సమావేశం అయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూర్యాపేట జిల్లా ప్రాముఖ్యతను, సంస్కృతి, సంప్రదాయాలను, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో గవర్నర్ కు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, ఇందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను పూర్తి వివరాలతో సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న 475 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ అనేది ఒక కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేకించి సూర్యాపేట లాంటి జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుంచి పైకి తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సూర్యపేట జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల కార్యక్రమాలు బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారత పై ఆధారపడి ఉందని, ఈ విషయం తాను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా.. సహాయక మహిళలు వారు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన లో గుర్తించానని చెప్పారు. అలాగే స్వయం శక్తితో ఉపాధి కల్పించుకొని విజయాలు సాధించిన మహిళలను సమాజానికి తెలియజేయాలని అప్పుడే ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారని అన్నారు . మహిళల చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల మెరుగు కోసం కృషి చేయడం చాలా ముఖ్యమని, సమాజంలో ఉన్న చివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు చేరాల్సిన అవసరం ఉందని అన్నారు .దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితే వికసిత్ భారత్ సాధ్యమన్నారు.

సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యం, విద్య రంగాలను పరిశీలిస్తే.. మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి విద్యలో 2024లో పదో తరగతిలో 96.91% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, చిన్న చిన్న పరికరాల వంటివి తెలియజేస్తే వారు ఇంకా విజ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉందని అన్నారు. అలాగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయడంతో వారు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజం అంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని ఆయన చెప్పారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తక్కువ వ్యవదిలోనే దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ,తలసరి ఆదాయంలో సైతం ముందున్న రాష్ట్రంగా ముందుకు వెళుతున్నదని ,ప్రత్యేకించి ఐటి, సాఫ్ట్ వేర్, ఫార్మా ,సైన్స్ రంగాలలో తెలంగాణ దేశంలోనే కాకుండా, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నదని, వ్యవసాయంలో సైతం ముందుందని ,28 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను వ్యవసాయానికి కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఆరు లక్షల నూతన ఆయకట్టును సృష్టించి వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాలలో చురుకైన సహకారం అందిస్తున్నదని, ఆహార భద్రతలో భాగంగా దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నామని, వారు మెరుగైన ఆహారాన్ని భుజించాలన్న ఉద్దేశంతో వచ్చే జనవరి నుంచి సన్నబియాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కు అదనంగా 500 రూపాయల బోనస్ ను సన్నధాన్యానికి ఇస్తున్నామని, దేశంలోనే అత్యధిక ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఈ వానాకాలం 150 లక్షల మెట్ టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పండించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాను రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా చేయాలని తమ లక్ష్యమని, రైతుల పండించిన ధాన్యం సేకరించేందుకు 20వేల కోట్ల రూపాయలను అడ్వాన్స్ గా ఉంచడం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సౌకర్యం కింద ఆరు లక్షల 16 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతున్నదని, జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు రావాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. సూర్యాపేటకు సంస్కృతి, సంప్రదాయాల పరంగా, చరిత్రపరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, మసీదులు, బౌద్ధ స్థలాలు, చర్చిలతోపాటు.. గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం ,విద్య, వ్యవసాయం, ఉద్యానం, సంక్షేమం ,నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాలు, తదితర ముఖ్యమైన శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాలలో చేసిన కృషిని రాష్ట్ర గవర్నర్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శాలువా, జ్ఞాపికతో సన్మానించారు.


Similar News