ఈజీమనీ మోసాలు.. టార్గెట్ వీళ్లే

ఆన్లైన్లో ఈజీ మనీ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు కేటుగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా.. డబ్బుపై ఆశతో పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు.

Update: 2024-10-07 02:16 GMT

దిశ, మిర్యాలగూడ: ఈజీ మనీకి అలవాటు పడి ఆన్‌లైన్‌లో డబ్బు పెట్టి పలువురు మోసపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరిని టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ యాప్‌ల ద్వారా బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్ లైన్‌లో వచ్చిన కొత్త యాప్‌లను నమ్మి భారీగా డబ్బులు పోగొట్టుకుని పలువురు బాధితులు లబోదిబోఅంటున్నారు. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో తెలియని యాప్‌లలో పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. దీంతో ఆశాపరులను టార్గెట్ చేస్తూ ఆన్ లైన్ మోసగాళ్లు కొద్ది రోజులపాటు బాధితుల ఎకౌంట్లలో డబ్బులు వేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్ లైన్ యాప్‌లలో డబ్బులు పెట్టి మోసపోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం ఆన్ లైన్ యాప్‌లను నమ్ముతూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. దీంతో వేల రూపాయల పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు సంపాదించవచ్చనే వారి ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. ఈ ఆన్ లైన్ యాప్‌లలో ఎక్కువగా సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగులు ఉండడం విశేషం. సామాన్యులను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు ఆర్థికనేరాలకు పాల్పడుతున్నారు. తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. ఈ ఆన్ లైన్ యాప్‌లలో ఎక్కువగా సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగులు ఉండడం విశేషం. సామాన్యులను టార్గెట్ చేస్తూ మోసగాళ్లు ఆర్థికనేరాలకు పాల్పడుతున్నారు.

చైన్ సిస్టంతో బురిడీ..

ఆన్ లైన్ మోసాలన్నీ చైన్ సిస్టం ద్వారానే జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్, బీపీఎల్ ఆయిల్ కంపెనీ, బిట్ కాయిన్ వంటి యాప్‌లతో ప్రజలు మోసపోతున్నారు. ఈ యాప్‌లన్నీ కూడా చైన్ సిస్టం ద్వారా నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐఏఎస్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని వందలమంది బాధితులుగా నిలిచారు. ఆన్ లైన్ యాప్‌లలో ముందుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేసి జాయిన్ కావాల్సిందిగా సూచిస్తారు. అనంతరం కొన్ని టాస్క్‌ల రూపంలో రీల్స్ పంపి రీల్స్‌కు కొంత అమౌంట్ చొప్పున అకౌంట్లో జమ చేస్తూ ప్రజలను మోసం చేస్తుంటారు. ఐఏఎస్ యాప్‌లో 2100 డిపాజిట్ చేస్తే రోజుకు ఐదు రీల్స్ పంపి ఒక్కొక్క రీల్‌కు లైక్ కొట్టడం ద్వారా రూ.15 చొప్పున మొత్తం రూ.75 జమ చేస్తారు. రూ.5500 డిపాజిట్ చేసిన వారికి 10 రీల్స్ పంపి ఒక్కొక్క దానికి రూ.20 చొప్పున రూ.200 జమ చేస్తారు. రూ.18,300 డిపాజిట్ చేస్తే 15 టాస్కుల పంపి ఒక్కొక్క దానికి రూ.44చొప్పున రూ.660 జమ అయినట్లుగా చూస్తారు. దీంతోపాటు ప్రతి ఒక్కరు ముగ్గురు కన్నా ఎక్కువ మందిని ఈ స్కీంలో జాయిన్ చేయాల్సి ఉంటుంది. తమ కింద జాయిన్ అయినా ప్రతి ఒక్కరి నుంచి కొంత అమౌంట్‌గా వీరికి పంపిస్తుంటారు. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ గా మారుతుంది. ఐఏఎస్ యాప్‌తోపాటు బీపీఎల్ ఆయిల్ కంపెనీలో మొదటగా రూ.3వేలు, రూ.5వేలు, రూ.10వేల చొప్పున జాయిన్ కావడంతోపాటు మరికొంతమందిని జాయిన్ చేస్తూ పోతే 10శాతం చొప్పున జాయిన్ చేసినవారి అకౌంట్లో జమ అవుతుంది. దీంతోపాటుగా బిట్ కాయిన్ యాప్ అనే మరో యాప్ కూడా ఆన్ లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఈ యాప్స్ ద్వారా వేలమంది బాధితులు డబ్బులను పోగొట్టుకుని రోడ్డున పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

మోసపోయాక లబోదిబో...

ఈజీ మనీకి అలవాటు పడిన పలువురు ఆన్ లైన్‌లో డబ్బులు పెట్టి మోసపోయాక లబోదిబోమంటున్నారు. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా అధిక డబ్బుకు ఆశపడి ఆన్ లైన్‌లో పెట్టుబడి పెడుతున్నారు. గతంలో క్వాంటం, తరువాత మార్కెట్ కమిటీ స్కీముల ద్వారా చైన్ సిస్టంతో గత 40ఏళ్లుగా ప్రజల్లోకి వస్తూనే ఉన్నాయి. కాగా, ఇటీవల కాలంలో అందరినీ నమ్మించే విధంగా ఆన్ లైన్ యాప్‌ల ద్వారా బురుడీ కొట్టించడం సర్వసాధారణమైంది. తీరా మోసపోయామని తెలిశాక పోలీసులను ఆశ్రయించి లబోదిబోమంటున్నారు. ఈజీగా మనీ వస్తుందని ఆశపడి ఎలాంటి ఆన్ లైన్ యాప్‌ల ద్వారా మనీ పెట్టుబడులు పెట్టవద్దని పోలీసులు పేర్కొంటున్నారు.

ఆన్ లైన్‌లో మోసపోవద్దు : వీరబాబు, సీఐ, మిర్యాలగూడ రూరల్

పూర్తిస్థాయిలో సమాచారం లేకుండా ఆన్ లైన్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. అధిక వడ్డీతోపాటు, ఎక్కువ డబ్బులు జమ చేస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. తెలియకుండా ఎలాంటి డిపాజిట్లు పెట్టకూడదు. పోలీసుల పేరుతో ఫోన్లు చేసి ఓటీపీలు అడిగినా షేర్ చేయకూడదు. పూర్తిస్థాయిలో తెలుసుకొని సమాచారం అందించాలి తప్ప గుర్తుతెలియని వ్యక్తులకు ఎలాంటి సమాచారం అందించొద్దు.


Similar News