బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకే కాంగ్రెస్ మైండ్ బ్లాక్.. ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో చూడడంతోనే కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాక్ అయిందని కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
దిశ, కోదాడ టౌన్: బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో చూడడంతోనే కాంగ్రెస్ పార్టీ మైండ్ బ్లాక్ అయిందని కోదాడ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన కోదాడ మండలంలోని తొగర్రాయిలో ప్రచారం నిర్వహించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3016 భృతి ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పింఛన్, రైతుబంధు నగదు మొత్తాలను పెంచేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాపు చూసి మురుస్తోందని, కోదాడ గడ్డ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ లోకి పలువురి చేరిక..
అనంతగిరి మండలం మొగలాయికోటకు చెందిన పలు కాంగ్రెస్ కుటుంబాలు ఆదివారం బీఆర్ఎస్ లో చేరాయి. కోదాడలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.