బుల్డోజర్ పాలనను అడ్డగిస్తాం: బృందా కారత్

అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవులలో... Brindha Karath hits out at BJP

Update: 2023-03-01 13:36 GMT

దిశ, మిర్యాలగూడ: అటవీ హక్కుల చట్టం అమలు చేయకుండా అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవులలో జీవించే గిరిజనులను తరిమికొట్టేందుకు ఆదివాసీ గిరిజన ద్రోహిగా మోదీ నిలిచారని ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు, మాజీ ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు బృంద కరత్ ఆరోపించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న గిరిజన సంఘం మూడో రాష్ట్ర మహాసభలను బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగానే గిరిజన సంక్షేమానికి కేంద్ర బడ్జెట్ లో కోత విధించాడని పేర్కొన్నారు. దేశ జనాభాలో 8.6% ఉన్న ఆదివాసీ గిరిజనులకు 2.7% మాత్రమే నిధులు ఇచ్చారని, ఇది గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమేనన్నారు. దేశవ్యాప్తంగా మోడీ బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నాడని దాన్ని అడ్డగించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. కార్మిక కర్షకుల శ్రమను ఒక్క శాతం ధనికులకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు.

మోదీ విధానాల వల్ల దేశంలో పేదలు ధనికుల మధ్య తీవ్ర వ్యత్యాసం పెరిగిందన్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తానని చెప్పిన మోదీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేశాడని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని, పోడు భూములకు పట్టాలిచ్చి కేసీఆర్ తనహామీలు నిలబెట్టుకోవాలన్నారు. గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి గిరిజన ప్రజలు అండగా నిలవాలన్నారు. రాబోయే అసెంబ్లీ కురుక్షేత్రంలో రంగారెడ్డికి గిరిజనులు మద్దతు ఇచ్చి తమ సత్తా చాటాలన్నారు. మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా కార్మిక కర్షక సమస్యలపై పోరాడేవారిని ప్రజలు ఆదరించాలని కోరారు.

కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాంలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం చేసి నిరుద్యోగిత, ఆర్థిక అంతరాలు, మత విభజన పెంచుతున్న మోదీ కుట్ర పూరిత విధానాలను ప్రజలు విభేదించాలని కోరారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఐద్వా కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News