‘కూలిస్తే ఊరుకోం.. అవసరమైతే..’ హైకోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కేడర్!

నల్లగొండ (Nallagonda) బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-19 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ (Nallagonda) బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్యాలయాన్ని కూలిస్తే సహించేది లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Party Workers) చెబుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి నుంచి కార్యాలయంలోనే బస చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. బిల్డింగ్ దగ్గరే కాపలా కాస్తున్నారు. అవసరమైతే ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టుకు కూడా వెళతామని, కార్యాలయం కూలుస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి (Kancharla Bhupalreddy) హెచ్చరించారు. అయితే ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇదిలా ఉంటే నల్లగొండ బీఆర్ఎస్ భవనం అనుమతులు లేకుండా కట్టారని, ఈ భవాన్ని కూల్చేయాలని స్థానిక కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి (Congress Minister Komatireddy Venkatareddy) ఈ మధ్య కాలంలో అనేకసార్లు అధికారులను ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. తమ కార్యాలయానికి అనుమతులు ఇవ్వాలని, కూల్చివేయకుండా అడ్డుకోవాలని కోర్టును కోరారు. అయితే కోర్టు మాత్రం అనుమతులు నిర్మాణానికి ముందు తీసుకోవాలని, ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంటూ వెంటనే ఆ భవనాన్ని కూల్చేయాలని తీర్పునిచ్చింది. దీంతో బీఆర్ఎస్‌కి ఊహించని షాక్ తగిలినట్లైంది.

ఇదిలా ఉంటే ఒక్క నల్లగొండలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో దేనికీ అనుమతులు లేవని కాంగ్రెస్ పార్టీ (Comgress Party) నాయకులు ఆరోపిస్తున్నారు. వాటిపై కూడా త్వరలో విచారణ చేపడతామని హెచ్చరిస్తున్నారు.


Similar News