నా ఊరే నాకు ఎన్నో నేర్పింది: ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్
నా ఊరే నాకు ఎన్నో నేర్పిందని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు.
దిశ, వరంగల్ బ్యూరో: నా ఊరే నాకు ఎన్నో నేర్పిందని ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ అన్నారు. నాటు నాటు పాట ఇప్పుడు ఖండాంతరాలకు చేరుకుని తెలుగు ఖ్యాతిని చాటిందని అన్నారు. ఆస్కార్ అవార్డు స్వీకరించిన అనంతరం ఆదివారం తొలిసారిగా చంద్రబోస్ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగేకు చేరుకున్న ఆయనకు గ్రామస్థులు, ఆయన చిన్ననాటి స్నేహితులు ఘనంగా స్వాగతం పలికారు. బాణాసంచా, వాయిద్యా బృందాలతో కోలాహాల వాతావరణం మధ్య ర్యాలీగా చంద్రబోస్, సుచిత్ర దంపతులను సన్మాన వేదిక వద్దకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ ఇంత గొప్పగా స్వాగతం పలికిన తన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. మొట్టమొదటి ఆస్కార్ భారతదేశంలోనే చల్లగరిగే గ్రామానికి వచ్చిందని అన్నారు. తనకు వచ్చిన అవార్డు మన గ్రామానికి వచ్చినట్లేనని అన్నారు. నాకు ఆస్కార్ రావడం గ్రామ ప్రజలంతా కూడా పండుగలా చేసుకోవడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. చిన్నతనంలో ఊరి నుంచి ఊరి ప్రజల నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాని ఈ సందర్భంగా చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడు ఊరితో తన అనుబంధం కొనసాగుతుందని, ఊరికి తన సహాయ సహాకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు.