ఆశ్చర్యానికి గురిచేస్తోన్న 'మునుగోడు' వ్యయం.. ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు చేశారంటే?
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
'కండ్లు మూసుకొని పాలు తాగే పిల్లి.. తనను ఎవరూ చూడలేదని అనుకుంటుందట.' ఈ సామెతలాగే మన ప్రజాప్రతినిధుల పరిస్థితి తయారైంది. మునుగోడు ఉప ఎన్నిక దేశం దృష్టిని ఆకర్షించింది. డబ్బు, మద్యం ఏరులై పారింది. ప్రధాన పార్టీలు బై ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖర్చు చేశాయి. పెద్ద బహిరంగసభలు, వేలాది మందితో ర్యాలీలు నిర్వహించాయి. ఓటుకు రూ.10 వేల వరకు పంచినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల ఓటర్లే డబ్బులకు డిమాండ్ చేసినట్టు వినిపించింది. మరికొన్ని చోట్లనైతే డబ్బులు రాలేదని ఎలక్షన్‌ను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇంత జరిగిన మునుగోడు బైపోల్‌లో అభ్యర్థులు వెల్లడించిన ఖర్చు చూస్తే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వందలాది కోట్లు ఖర్చయినట్లు ప్రచారం జరిగిన ఈ ఉప ఎన్నికలో.. ప్రధాన పార్టీలు చూపెట్టిన ఖర్చు రూ. 1.20 కోట్లు దాటకపోవడం గమనార్హం. అంతేకాకుండా విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ కంటే తక్కువ ఖర్చు చేయడం విశేషం.
దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ బై పోల్‌ను ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచితీరాలని వ్యూహాలు రచించాయి. 100 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారాల తరబడి అక్కడే మకాం వేశారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలో ఏ పార్టీ అభ్యర్థి ఎంత ఖర్చు చేశారని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ఎన్నికల అధికారిని అడిగింది. పూర్తి వివరాలు తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు చేసింది. వారు దరఖాస్తును నల్లగొండ కలెక్టర్‌కు ఫార్వర్డ్ చేయగా ఆయన వివరాలను అందజేసారు. వీటిని సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో నాలుగు పార్టీలే ఉప ఎన్నికల ప్రచారానికి ఎక్కువ ఖర్చు పెట్టారని వారు ఇచ్చిన సమాచారంలో ఉంది.
అంత ఖర్చు.. చేసిందెవరు..?
మునుగోడు పల్లెల్లో రెండు నెలల పాటు మద్యం ఏరులై పారింది. ప్రతి దావత్ లో నాన్ వెజ్ కనిపించింది. సభల్లో లక్షలాది మంది పాల్గొన్నారు. వేలాది మందితో ర్యాలీలు నిర్వహించారు. అయితే వీటికి ఖర్చు పెట్టిందేవరనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఒక సభలో వంద మందికి పైగా కూర్చునే స్టేజీ వేసేందుకు ఎన్ని లక్షలు ఖర్చవుతాయి? మైకులు, లైట్ల కిరాయిలు ఎంత? వేలాది కార్లు, బైకుల్లో డీజిల్, పెట్రోలు ఎన్ని లీటర్లు ఖర్చయ్యింది? వీటన్నింటి ఖర్చు రూ.35 లక్షలు దాటలేదంటే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు, స్వ్కాడ్స్ ఏం పని చేశాయో విస్మయానికి గురి చేస్తున్నది. హుజూరాబాద్, దుబ్బాక, నాగార్జున్ సాగర్, మునుగోడు.. ఇలా అన్ని ఉప ఎన్నికలను ప్రత్యక్ష్యంగా చూసిన ప్రతి రాజకీయ విశ్లేషకుడు ఎన్నికలు ఖరీదయ్యాయన్న వారే. చట్టసభలకు సామాన్యులు వెళ్లలేరన్న వారే! ఇప్పుడీ లెక్కలు మాత్రం శుద్ధ అబద్ధాలుగా మిగిలిపోనున్నాయి.
Also Read...
షెడ్యూలు ప్రకారమే అసెంబ్లీ సెషన్.. పెండింగ్ బిల్లులకూ లైన్ క్లియర్!