జిల్లాలో మట్టి మాఫియా జోరు.. కన్నెత్తి చూడని పాలనాధికారులు

ప్రకృతి సంపదను దోచుకుంటూ మట్టి మాఫియా.. సిరిసిల్ల గుట్టలపై అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి యథేచ్ఛగా తరలిస్తున్నారు.

Update: 2024-09-09 02:30 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రకృతి సంపదను దోచుకుంటూ మట్టి మాఫియా సిరిసిల్ల గుట్టలపై అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి యథేచ్ఛగా తరలిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాలనే టార్గెట్‌గా చేసి మట్టి దందా కొనసాగిస్తున్నారు. పెద్ద పెద్ద టిప్పర్లు, బుల్డోజర్ లను ఉపయోగించి గుట్టలను గుల్ల చేస్తూ వెంచర్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్ నిర్మాణాలకు వేల సంఖ్యలో మట్టి టిప్పర్లను తరలించి కోట్లకు పరుగులెడుతున్నారు. ప్రకృతి సంపదలను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. జిల్లాలో జోరుగా అక్రమ మట్టి రవాణా జరుగుతుంటే అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఓ ప్రముఖ పత్రికకు చెందిన విలేకరి అండదండలతోనే తన సోదరుడు మట్టి దందాకు తెర లేపాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారం నోరు మెదపడం లేదని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తున్నాయి. "దిశ" పత్రికతో పాటు ప్రముఖ పత్రికలో ప్రత్యేక కథనాలు వచ్చిన దర్జాగా మట్టి దందా కొనసాగడంపై జిల్లా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

జోరుగా మట్టి దందా..

జిల్లా వ్యాప్తంగా మట్టి దందా జోరుగా కొనసాగుతోంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్, పోతిరెడ్డి పల్లె అడవి ప్రాంతాలను మొదలుకొని, వేములవాడ రూరల్ మండలం నాంపల్లి కొడిముంజ అగ్రహారం గుట్టలు, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల, సర్దాపూర్, పెద్దూరులోని మైసమ్మ గుట్ట, ఎద్దు గుట్టలతో పాటు ఇతర గుట్టలు, ఒకటో వార్డు రగుడు లోని పెద్ద గుట్ట (మల్లన్న గుట్ట) లతోపాటు ప్రభుత్వ భూములలో మట్టిని అక్రమార్కులు సిరిసిల్ల, వేములవాడ పట్టణ కేంద్రాలలో వెలసిన వెంచర్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

సెలవు దినాలే టార్గెట్‌గా..

ప్రభుత్వ సెలవు దినాలే టార్గెట్‌గా అక్రమ మట్టి రవాణా జరుగుతోంది. సెలవు దినాల్లో అధికారుల పర్యవేక్షణ ఉండకపోవడంతో అక్రమార్కులకు కలిసివస్తుంది. దీంతో సెలవు దినానికి ముందు రోజు సాయంత్రం వాహనాలను ఆయా గుట్ట ప్రాంతాలకు చేర్చి, రాత్రి పగలు తేడా లేకుండా సెలవు దినాలు ముగిసే వరకు గుట్టల నుండి టిప్పర్ల ద్వారా వేల ట్రిప్పుల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఆదివారం రోజున ఒకటో వార్డు రగుడులోని పెద్దగుట్ట (మల్లన్న గుట్ట) నుండి దాదాపు వందల ట్రిప్పుల మట్టిని సిరిసిల్ల మొదటి బైపాస్ లోని ఓ ప్రైవేటు అపార్ట్మెంట్ నిర్మాణానికి అక్రమార్కులు తరలించారు. విషయం తెలుసుకున్న దిశ పత్రిక ప్రతినిధి వార్తా సేకరణకు వెళ్లడంతో బుల్డోజర్‌ను వదిలి ఆ ప్రాంతం నుండి టిప్పర్లతో సహా పరారయ్యారు. అయితే గత రెండు రోజులుగా పెద్దగుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం.

పట్టించుకోని అధికారులు..

రోజురోజుకు మట్టి మాఫియా మితిమీరుతుంటే సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న పాలన అధికారులు మాత్రం కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. అధికారులే కాసులకు కక్కుర్తి పడి అక్రమ మట్టి రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా గుట్టలను తవ్వుతున్నారని అధికారులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ చేసిన సంబంధిత అధికారులు స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేసి, జిల్లా సహజ సంపదను కాపాడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ప్రకృతి సహజ సంపదలను కాపాడాలి.. గున్నాల లక్ష్మణ్ , జిల్లా పరిరక్షణ సమితి సభ్యులు.

ప్రకృతి మనకు ప్రసాదించిన సహజ, ఖనిజ సంపదలు అంతరించిపోతే మానవ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముంది. జిల్లా వ్యాప్తంగా అక్రమ మట్టి రవాణా జరుగుతుంది. ఇలాంటివి అరికట్ట లేకపోవడం వల్లనే విపత్తులను కొని తెచ్చుకుంటున్నాం. జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి అక్రమ మట్టి రవాణాను అరికట్టాలి. జిల్లాలో మట్టి మాఫియా పై ఉక్కు పాదం మోపి, జిల్లా సహజ సంపదను కాపాడాలి. అలాగే అక్రమ మట్టి రవాణా చేస్తున్న ఆయా వాహనాలను సీజ్ చేసి, మట్టి దందా చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి.


Similar News