అర్హులందరికి దళితబంధు: ఎంఎస్ ప్రభాకర్ రావు
దళిత బంధు పథకం అర్హులందరికీ అవినీతికి ఆస్కారం లేకుండా అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు అన్నారు..
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత బంధు పథకం అర్హులందరికీ అవినీతికి ఆస్కారం లేకుండా అమలయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు అన్నారు. ఈ విడతలో ప్రతి నియోజకవర్గంలో 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ శాసనమండలి ఆవరణలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో దళిత సంఘాల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈ నెల 14న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే కార్యక్రమాలతో పాటు దళిత సంక్షేమం, అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు, అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ పథకంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, గురుకుల పాఠశాలలు, స్కాలర్ షిప్, కళ్యాణ్ లక్ష్మీ పథకాలతో దళితులకు ఎక్కువ మేలు జరిగిందని ఎంఎస్ ప్రభాకర్ రావు తెలిపారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుతో పాటు రాష్ట్ర పరిపాలన భవనమైనటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు దళిత సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలకు దళితులు ఎపుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా దళిత నాయకులు అన్నారు.
ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సభా స్థలానికి బస్సుల్లో చేరుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. నూతనంగా అంబేద్కర్ జగ్జీవన్ ఉత్సవాలకు ఉపాధ్యక్షులుగా ఎంపికైన జంగ శ్రీనివాస్, శ్యాం కుమార్‌లను ప్రభుత్వ విప్ ప్రభాకర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, సీనియర్ దళిత నాయకులు ఆవులు అంజయ్య, రాజు వస్తాద్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మందాల భాస్కర్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, వివిధ బస్తీల నుంచి వచ్చిన దళిత నాయకులు పాల్గొన్నారు.