అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పిన సీఎం: మందకృష్ణ మాదిగ సీరియస్

అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-09 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు (బుధవారం) 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అదించనున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడు ఎలాంటి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా అందజేస్తారని ప్రశ్నించారు.

దీనివల్ల తమ మాదిగ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మొత్తం 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని, కానీ వర్గీకరణ చేపట్టకపోవడంతో కనీసం తమకు 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం తమకు వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నారని, దమ్ముంటే ఎస్సీ ఉద్యోగాల్లో ఎవరు లబ్ధి పొందారో శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తగిన మూల్యం చెల్లించే రోజు వస్తుందని హెచ్చరించారు.

ఇక వర్గీకరణ విషయంలో మాదిగలకు జరిగిన అన్యాయానికి నిరసనగా నేడు (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని, జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే నగరంలో లోయర్ ట్యాంక్ బండ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్​బాగ్​బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.


Similar News