రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. నిండు సభలో MP సహా ఎమ్మెల్యేల డిమాండ్
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy)కి మంత్రి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటు గెలిపిస్తే.. మంత్రి పదవి(Minister Position) ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్తా. నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది’ అని రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. మేమంతా రాజగోపాల్ రెడ్డి కోసం ఎక్కడ సంతకం చేయాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని మేము భావిస్తున్నామని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మీద విజన్, సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Kumbam Anil Kumar Reddy) మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీద రాజగోపాల్ రెడ్డికి పూర్తి పట్టు ఉందన్నారు. ప్రజల్లో, అభిమానుల్లో రాజగోపాల్ రెడ్డి స్థానం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుందని తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి జిల్లాలోనే కాదు రాష్ట్రమంతా అభిమానులు ఉన్నారని అన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ.. ‘చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను పెద్ద పాపులర్ పర్సన్ కాదు. పార్టీలో కింది స్థాయి నుంచి కష్టపడితే పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. నా గెలుపును తన భుజాల మీద వేసుకొని గెలిపించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి లేకపోతే నా గెలుపు అంత సులువు అయ్యేది కాదు. తనను ఎంపీగా గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి క్రియాశీలక పాత్ర రాజగోపాల్ రెడ్డిది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లను ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని చామల కిరణ్ డిమాండ్ చేశారు.