KCR వాళ్లను మోసం చేస్తాడని నాకు ముందే తెలుసు: MP ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది నవంబరు 30న పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది నవంబరు 30న పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉన్నదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యతో కలసి టిక్కెట్ల కోసం అప్లై చేశానన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాలకు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. పార్టీ పరిశీలించి టిక్కెట్లు కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని, డిసెంబరులో పార్టీ పవర్‌లోకి వస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలుస్తామన్నారు. కేసీఆర్ పాలనలో లిక్కర్ సేల్.. కరప్షన్‌లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నామన్నారు.
స్కీమ్‌ల పేరిట స్కాంలు చేస్తూ ఒక్కొక్కరి మీద లక్ష ఇరవై వేలు అప్పు పెట్టారన్నారు. హుజురాబాద్ దళిత బంధు స్కీంలో కమీషన్లు తీసుకున్నారని, 50 శాతం కమీషన్లు వసూల్ చేసినట్లు తమకు సమాచారం ఉన్నదన్నారు. యూనిట్ రాకముందే కమీషన్లు తీసుకున్నారన్నారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు చెప్పినా.. స్పందన లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాండ్, లాండ్, మైన్, వైన్‌గా దోచుకున్నారన్నారు. ఓడిపోతాననే భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీకి దిగాడన్నారు. కమ్యూనిస్టులను కేసిఆర్ మోసం చేస్తాడని తనకు ముందే తెలుసునని చెప్పారు.