ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ORR స్కామ్ వెయ్యి రెట్లు పెద్దది: రేవంత్ రెడ్డి
దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలోనే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ వెయ్యి రెట్లు పెద్దదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు తెగనమ్మారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇంతపెద్ద స్కామ్ జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని.. ఓఆర్ఆర్ టోల్ స్కామ్‌పై ఎందుకు విచారణ జరిపించట్లేదని ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్‌కు సంబంధించిన లెటర్ ఆఫ్ అగ్రిమెంట్‌ను హెచ్ఎండీఏ ఐఆర్‌బీ సంస్థకు ఇచ్చిందని.. అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో ఒప్పందంలోని 25 శాతం డబ్బులను కాంట్రాక్ట్ దక్కించుకున్న ఐఆర్‌బీ కంపెనీ చెల్లించాలని.. కానీ ఇప్పటివరకు ఐఆర్‌బీ సంస్థ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించలేదని ఆరోపించారు. ఈ 30 రోజుల నిబంధనపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ చెబుతారని రేవంత్ నిలదీశారు.
ప్రభుత్వం తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని.. ఐఆర్‌బీ సంస్థకు అక్రమంగా 30 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఇచ్చారని అన్నారు. ఈ ఓఆర్ఆర్ టోల్ స్కామ్‌లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్రదారులు కాగా.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అర్వింద్ కుమార్ సూత్రదారులని ధ్వజమెత్తారు.
Also Read...