ఏడు నెలల్లోనే కాంగ్రెస్ నిజస్వరూపం తేటతెల్లం: MP ఈటల ఫైర్
ఉద్యోగాల భర్తీ విధానంలో బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ వస్తే బ్రతుకులు మారుతాయని
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విధానంలో బీఆర్ఎస్ తప్పుడు విధానాల వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ వస్తే బ్రతుకులు మారుతాయని భావించారని, కానీ ఏడు నెలల్లోనే ఆ పార్టీ నిజస్వరూపం తేటతెల్లమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. తెలంగాణలో నిరుద్యోగులు పదేళ్లుగా కళ్లలో వత్తులు వేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది..? ఇప్పుడు ఏం చెబుతోందని ఆయన ప్రశ్నించారు.
నిరుద్యోగులపై పాశవిక దాడి కాంగ్రెస్ నైజానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరుద్యోగులు ఏమైనా దొంగలా..? సంఘవిద్రోహశక్తులా..? మాదకద్రవ్యాలు అమ్మేవారా..? అని విరుచుకుపడ్డారు. వారిని విచక్షణ రహితంగా కొడుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఇందుకేనా కాంగ్రెస్‌ను ఎన్నుకుందని మండిపడ్డారు. నిరుద్యోగులు, జర్నలిస్టులపై దాడిని ఈటల తీవ్రంగా ఖండించారు. నిరంకుశ విధానాలను పక్కనపెట్టి నిరుద్యోగుల డిమాండ్స్ పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.