కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఈటల.. ‘నీచ సంస్కృతి’ అంటూ ఫైర్

ప్రతి బిల్లుకి 8 శాతం డబ్బులు ముందు చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని చెబుతున్నారని, ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం

Update: 2024-07-12 17:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి బిల్లుకి 8 శాతం డబ్బులు ముందు చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని చెబుతున్నారని, ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. శంషాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ కాలంలో నిరుద్యోగ యువత విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం తమకు లేదని ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులుఉ చేతులెత్తేస్తున్నారన్నారు. ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి చెప్పాల్సిందే అంటున్నారని ఆయన తెలిపారు. ప్రతి బిల్లుకి డబ్బులు తీసుకునే నీచమైన, నికృష్టమైన సంస్కృతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని ఈటల విమర్శలు చేశారు.

ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల దగ్గర నుంచి కూడా ట్రిపుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే విద్యార్థుల నుంచి ఎక్కువ డబ్బులు యాజమాన్యాలు తీసుకునే దుస్థితి వచ్చిందని ఫైరయ్యారు. బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ అనుమతి కోసం ఒక్కొ స్క్వేర్ ఫీట్ కు రూ.75 తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకొని సీఎం మనుషులు దందా చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని రాజేందర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఉప్పల్‌లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి భూములను వక్స్ భూములుగా ప్రకటించి స్థానికులను మనోవేదనకు గురిచేస్తున్నారని ఈటల విరుచుకుపడ్డారు. పీర్జాదిగూడలో ఎన్నో ఏళ్ల క్రితం కొనుక్కొని కట్టుకుంటున్న ఇళ్లను రాజకీయ కక్షతో రాత్రికి రాత్రే కూల్చివేశారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రూ.2 లక్షల కోట్లు కావాలని, అవి తెచ్చే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అని ఈటల ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి అన్ని పదవులు గెలుచుకునే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ధీమా వ్యక్తంచేశారు. అందుకు నాయకులంతా విరామం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈటల రాజేందర్ సూచించారు.


Similar News