కేసీఆర్ నా గురువు.. ఆయన ఎక్కడున్నారో KTR చెప్పాలి: ఎంపీ బండి కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ శాఖ మంత్రి అజయ్ రావుకు(కేటీఆర్) కండకావరం తలకెక్కిందని, ఆయన ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకున్న చరిత్ర తమకు తెలియదా? ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించారో తెలియదా? అని
దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ శాఖ మంత్రి అజయ్ రావుకు(కేటీఆర్) కండకావరం తలకెక్కిందని, ఆయన ముడతల చొక్క, రబ్బర్ చెప్పులేసుకున్న చరిత్ర తమకు తెలియదా? ప్రజల సొమ్మును దోచుకుని వేల కోట్లు ఎట్లా సంపాదించారో తెలియదా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అని బండి సంజయ్ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కేసీఆర్ గెలిస్తే శ్రీలంక దుస్థితే రాష్ట్రానికి ఏర్పడుతుందన్నారు.
తెలంగాణలో అభివృద్ధి కోసం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన కోరారు. పసుపు బోర్డ్, ట్రిబ్యునల్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన ఫైరయ్యారు. ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించక నెలరోజులు దాటిందని, తనకు మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబంపైనే అనుమానం ఉందన్నారు. కేసీఆర్ తనకు గురువని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని బండి ఎద్దేవాచేశారు. వెంటనే సీఎంను ప్రజల ముందు హాజరుపర్చాలని బండి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాలో కోత పడటానికి కారణం కేసీఆరే, తీరని ద్రోహం చేశారని ఆయన విరుచుకుపడ్డారు. అపెక్స్ కమిటీ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవ్వలేదని మండిపడ్డారు.
9 ఏళ్లుగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేసీఆర్ లేఖలు రాశారని, సుప్రీం కోర్టులో కేసు కారణంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పారని, అయితే కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్న ఏడాదిలో కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని ఆయన నొక్కిచెప్పారు. 9 ఏళ్లుగా దక్షిణ తెలంగాణ ఏడారిగా మారడానికి ప్రధాన కారణం కేసీఆరేనని బండి విరుచుకుపడ్డారు. ఒక్క మోటార్‌తో 10 లక్షల ఏకరాలకు నీళ్ళు ఇచ్చే మొనగాడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. డీపీఆర్‌లో కనీసం నీటి కేటాయింపులు లేవని, దానికి జాతీయ హోదా ఎలా ఇస్తారని బండి ప్రశ్నించారు. కేసీఆర్‌కు మందు, గోళీలు ఇచ్చే సడ్డకుడి కొడుకును ఇంట్లో నుంచి బయటకు పంపించేశారో సమాధానం చెప్పాలని సంజయ్ సెటైర్లు వేశారు.