కాంగ్రెస్‌కు మరింత గడ్డు పరిస్థితి.. మునుగోడు బైపోల్ తర్వాత ఏం జరుగనుంది?
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు అంటేనే.. హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలవవుతున్నది. ఒక్కో ఉప ఎన్నిక తర్వాత కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు అంటేనే.. హస్తం పార్టీ నేతల్లో టెన్షన్ మొదలవవుతున్నది. ఒక్కో ఉప ఎన్నిక తర్వాత కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. హుజూర్నగర్ సిట్టింగ్ సీటును టీఆర్ఎస్‌కు అప్పగించి, అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేతులెత్తేశారు. ఆ తర్వాత దుబ్బాక, నాగార్జున సాగర్‌లోనూ అదే పరిస్థితి. పెద్దలు జానారెడ్డి కంచుకోటగా చెప్పుకునే సాగర్‌లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ను పరేషాన్‌లో పడేసింది. టీపీసీసీ చీఫ్ బాధ్యతల తర్వాత అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బై ఎలక్షన్ ఇదే. దీనిపై ఏకంగా ఏఐసీసీ సైతం దృష్టి పెట్టింది. కర్ణాటకకు చెందిన సీనియర్ నేత ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏఐసీసీ నియమించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అంతకు మించిన పరిస్థితి మునుగోడు తీసుకువచ్చింది. ఇది కూడా కాంగ్రెస్‌కు సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. గెలువకున్నా.. కనీసం రెండో స్థానంలో నిలిచి, పార్టీ కేడర్ బలంగా ఉందని నిరూపించుకోవాల్సి ఉంది. మునుగోడుపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, రాష్ట్ర నేతలు దృష్టి పెట్టారు. ఎందుకంటే.. ఈ ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ భవితవ్యమే బయట పడనుంది. పార్టీ కంటే.. పార్టీలోని నేతలు కాంగ్రెస్ జెండా కింద ఉండాలా.. ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనే చర్చ గాంధీభవన్‌లో వినిపిస్తున్నది.
నిలబడి.. తట్టుకోవాల్సిందే
మునుగోడు నియోజకవర్గంలో బూత్ లెవల్ నుండి క్యాడర్ ఉన్నది హస్తం పార్టీకే. కానీ, ఇక్కడి నేతల పనితీరుపైనే పార్టీలో అనుమానాలున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పార్టీ నేతలను పట్టించుకోలేదని అపవాదు ఉంది. ఇదే కారణంతో పలువురు టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ కేడర్ ను ఆయోమయంలో పడేస్తున్నాయి. ఓవైపు టీఆర్ఎస్, బీజేపీలు ఆల్రెడీ ఉప ఎన్నిక పర్వంలో మునిగిపోయాయి. కాంగ్రెస్ మాత్రం సొంత కష్టాల్లోనే ఎదురీదుతున్నది. కీలక నేతలుగా వున్న వాళ్లు కూడా పట్టించుకోకుంటే మునుగోడులో ఘోర ఓటమి తప్పదనే సంకేతాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక స్థానంలో నిలుస్తున్నది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరూ డౌన్ చేయడం లేదని, ఆ పార్టీ నేతలే దాన్ని ముంచేస్తున్నారని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.
నల్లగొండ నుంచే వరుస కష్టాలు
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జునసాగర్, హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి. అవే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కడా సరైన ప్రభావం చూపలేదు. కనీసం పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు పక్కనబెడితే.. హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ చేజేతులారా ఫెయిల్ అయ్యిందనే విమర్శలున్నాయి. 2018లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఆయన ఎంపీగా పోటీచేసి గెలవగా.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే గెలుస్తారని అందరూ భావించారు. ఉత్తమ్ సతీమణి పద్మావతిని రంగంలోకి దింపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పోటీచేసినా.. ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండే నల్గొండ జిల్లాలో ఈ రెండు ఉప ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి.
ఎవరు ప్రత్యామ్నాయం..?
ఇలా ఉప ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. అయితే, టీపీసీసీ చీఫ్ దూకుడు, రాహుల్ గాంధీ టూర్ పై కొంత ఆశలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో తాజాగా మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఇక్కడ గెలిచారు. ఇప్పుడు ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీన్ని అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తిసుకున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉన్నా.. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి కీలకం కానుంది. ఇప్పటికే వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్.. ఇక్కడ కూడా ఓడిపోతే ఇక టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే బీజేపీ వాదనను ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. మేమే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే.. 2023 ఆఖర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతామని కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలు ప్రజలు నమ్మాలంటే మునుగోడు ఎన్నిక సెమీ ఫైనల్ కానుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం చూపితే తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఉండబోదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఉందామా.. పోదామా..?
గాంధీభవన్‌లో ఓ కీలక నేత వ్యాఖ్యలు పార్టీ నేతలను ఆయోమయంలో పడేస్తున్నాయి. ఇలా పలువురు నేతలు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఆ ఎన్నికలతో నష్టపోతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. హుజుర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. నాగార్జునసాగర్‌లో రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచినా అదంతా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యక్తిగత ఇమేజ్ వల్లే అనే వాదన ఉంది. ఈ ఉప ఎన్నికల ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నదని, ఆ స్థానంలో టీఆర్ఎస్‌కు పోటీగా బీజేపీ బలపడుతున్నదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చివరి ఉప ఎన్నిక అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మునుగోడులో సత్తా చాటాలని టీఆర్ఎస్, బీజేపీలు బలంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగితే.. మరోసారి కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయే పరిస్థితి లేకపోలేదనే చర్చ కూడా సాగుతున్నది. నిజంగానే అదే జరిగితే.. ఇక కాంగ్రెస్ నేతలు పక్కదారి చూసుకుంటారని గాంధీభవన్ లో ప్రచారం జరుగుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలే ఉంటాయని, దీంతో పార్టీ అధికారంలోకి రావడం కాదు.. కనీసం ప్రతిపక్షంలో ఉండటం కూడా కష్టమేనని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో ముందస్తుగానే సర్దుకుంటే మంచిదనే ధోరణితో ఉంటున్నారు. మునుగోడులో గెలువడం అటుంచితే.. రెండు పార్టీలకు ధీటుగా నిలబడి రెండోస్థానంలో ఉంటే పార్టీలో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, ఇక్కడ కూడా పాత కథే పునరావృతమైతే.. ఇక రాష్ట్రంలోని ఆయా జిల్లాల నేతలు ప్రత్యామ్నాయం వైపు పరుగులు తీయనున్నారు. అందుకే మునుగోడు ఫలితాలపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు.. బార్డర్ పై నిలుచున్నారు.
ఆపరేషన్ మునుగోడు స్టార్ట్.. వారికి టీఆర్ఎస్ సర్కారు భారీ ఆఫర్లు!