కేసీఆర్ లేక తలో దారిలో బీఆర్ఎస్ లీడర్లు.. రోజూ కన్‌ఫ్యూజ్ చేస్తున్న కేటీఆర్?

పదేళ్లుగా తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంతో రికార్డు నెలకొల్పాలని భావించిన గులాబీ పార్టీకి అసెంబ్లీ

Update: 2024-01-13 08:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్లుగా తెలంగాణలో అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయంతో రికార్డు నెలకొల్పాలని భావించిన గులాబీ పార్టీకి అసెంబ్లీ ఎన్నిక్లలో ప్రజలు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో ఆ పార్టీలో నేతలు అయోమయంలో పడ్డారనే టాక్ వినపిస్తోంది. ఇన్నాళ్లు అంశం ఏదైనా పెదవి విప్పాలంటే అధినేత కేసీఆర్ ఆజ్ఞ కోసం ఎదురు చేసే గులాబీ లీడర్లు ప్రస్తుతం పెద్దాయన మంచం ఎక్కడంతో ఇక అంతా మన ఇష్టమే అన్నట్లుగా తలోదారిలో మాటమాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పరిస్థితిని చక్కదిద్ది నేతలను అదుపులో పెట్టాల్సిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తాజా రాజకీయ పరిణామాలపై పూటకో మాట మాట్లాడుతుండటం ప్రస్తుతం గులాబీ శ్రేణులను మరింత కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోందని పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదనే చర్చ జోరందుకుంటోంది.

లీడర్లపై పట్టేది?:

రెండు సార్లు అధికారంలో ఉండగా మంత్రులు, పార్టీ నేతలపై పట్టు కోసం కేసీఆర్ నిరంతరం స్ట్రాటజీ ప్లే చేసేవారని అధినేత ఆజ్ఞలేనిదే పార్టీ నేతలెవరైనా సరే నోరు విప్పేవారు కాదనే టాక్ ఉంది. పార్టీలో ఎవరికి ప్రాధాన్యత, అవకాశాలు ఇవ్వాలి, ప్రత్యర్థులలో ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేయాలి అనేది అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగేదని చెబుతుంటారు. దీంతో కేసీఆర్ ను ధిక్కరించి మారుమాట మాట్లాడేందుకు సాహసించే నేతలు తాజాగా కేసీఆర్ ఇంటికే పరిమితం కావడంతో తలో మాట మాట్లాడుతుండటం చర్చనీయాశం అవుతున్నది.

కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కడియం శ్రీహరిలాంటి కొందరు నేతలు వ్యాఖ్యలు చేయగా, పార్టీ ఓటమికి ప్రజలే కారణం అని మరి కొందరు, సొంత కార్యకర్తల వల్లే ఓడిపోయామని మరి కొందరు ఎవరికి నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్లు టికెట్ల విషయంలో అధినేత నిర్ణయమే శిరోధార్యం అన్నట్లుగా వ్యవహరించిన నేతలు తాజాగా పార్లమెంట్ ఎన్నికల వేళ తమకు అవకాశం ఇవ్వాల్సిందే అని లీకులు ఇస్తున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమ కుమారుడు పోటీ చేస్తాడని గుత్తాసుఖేందర్ వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. దీంతో అధికారం చేజారిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం సొంత లీడర్లపై పట్టు కోల్పోతున్నదా అనే చర్చ రోజురోజుకు బలపడుతున్నది.

డ్యామేజీ కంట్రోల్ కోసమే కేటీఆర్ యూటర్న్:

రాజకీయాల్లో ఎంతటి ఘనాపాటి నాయకుడికైనా, ఎంతటి చరిత్ర కలిగిన పార్టీకైనా ప్రజాతీర్పే శిరోధార్యం. కానీ అసెంబ్లీ ఎన్నిక్లలో పార్టీ ఓటమిపై బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రజాతీర్పునే తప్పుపట్టేలా వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజలు అబద్దాలనే నమ్మారని ఒకరు, సొంత ఎమ్మెల్యేల వల్లే నష్టపోయామని మరొకరు ఓటమిపై బీఆర్ఎస్ లోని కీలక నేతలో పూటకో మాట మాట్లాడుతుంటే ఇక తమను కాదని కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

అసలే ఓటమితో సతమతం అవుతున్న బీఆర్ఎస్ లో ప్రజాతీర్పునే తప్పుపట్టే వ్యాఖ్యలు సరికావనే విమర్శలు రాజకీయ పండితుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పార్టీలో జరగుతున్న పరిణామాలను కంట్రోల్ చేయడంలో కేటీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ నేతలు కంట్రోల్ తప్పితే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మరింత డ్యామేజ్ తప్పదనే అంచనాకు వచ్చిన కేసీఆర్ అప్రమత్తం చేశారని దీంతో పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే అంటూ తాజాగా కేటీఆర్ పార్టీలో జరిగిన తప్పిదాలను అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News