HYD: హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసి బాధితుల ఆందోళన

హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసి బాధితులు ఆందోళన నిర్వహించారు.

Update: 2024-09-30 08:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కలెక్టరేట్ ముందు మూసి బాధితులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో మూసీ బాధితులకు మద్దతుగా.. సీపీఎం నేతలు పాల్గొన్నారు. మూసీ పరివాహాక ప్రాంతాల్లో నివసిస్తున్న బాధితులు ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. "మా ఇల్లు ఇక్కడే మా జీవితాలు ఇక్కడే" అంటూ ప్లకార్డులు పట్టుకొని కలెక్టర్ కార్యాలయం గేటు మందు బైఠాయించారు. ఈ ఆందోళనలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపుతూ.. బాధితులతో పాటు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాధితులు.. ప్రజలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోందని, కానీ తమను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదని, తమను తామే కాపాడుకుంటామని చెబుతున్నారు. అంతేగాక తాము ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని, తమకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని, న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ లో భాగంగా ప్రభుత్వం నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయాలని చెబుతూ నోటీసులు అందించడమే కాక.. వారి ఇళ్లకు మార్క్ వేస్తున్నారు. మూసీ బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు, నష్టపరిహరం ఇస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. దీనిపై కొందరు స్వచ్చందంగా ఖాళీ చేస్తామని చెబుతుండగా.. మరికొందరు ససేమిరా అంటున్నారు.


Similar News