టీనేజ్ పిల్లలను వణికిస్తోన్న వైరస్.. ఆఫ్రికాలో మొదలై ప్రపంచ దేశాలకు ఎంట్రీ

Update: 2024-08-27 11:35 GMT

కరోనా మహమ్మారి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుపడుతున్న క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో పిడుగు లాంటి ప్రకటన చేసింది. అతి త్వరలో మరో ప్రమాదకర వైరస్ దాడి చేయబోతోందనే వార్త హెచ్చరించింది. ఆ అలర్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని కునుకు లేకుండా చేస్తున్నది. మూడేళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైన ఎమ్ పాక్స్​(మంకీ పాక్స్)వైరస్, ఇప్పుడు ప్రపంచదేశాలకు విస్తరిస్తూ తన వ్యాప్తిని పెంచుకుంటున్నది. కాంగోలో మొదలైన ఈ వైరస్.. దాని పొరుగు దేశాలైన బురుండీ, కెన్యా, రువాండా, ఉగాండా తదితర దేశాలకు పాకడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమై గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించగా, అన్ని దేశాల్లో అప్రమత్తత అనివార్యమైంది. తాజాగా విజయవాడలో ఒక అబ్బాయికి ఈ వ్యాధికి గురైనట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఫ్యామిలీ దుబాయ్​నుంచి రావడంతోనే అస్వస్థతకు గురవడంతో వ్యాధి విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు మంకీ పాక్స్​వైరస్​అంటా ఏంటి? దీని తీవ్రత గురించి వివరంగా తెలుసుకుందాం.. 

- గోపు రాజు

మూడేళ్ల కిందే.. హెల్త్​ఎమర్జెన్సీ

ఎమ్ పాక్స్ వైరస్ ను మంకీ పాక్స్ అని కూడా పిలుస్తారు. మూడేళ్ల క్రితం ఆఫ్రికాలో మొదలైనప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు వ్యాధి తీవ్రత తగ్గే సరికి ప్రమాదమేమీ లేదని హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేశారు. అయితే కరోనా మాదిరిగానే ఇందులో కూడా కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తున్నాయి. ఎంపాక్స్‌లో క్లేడ్ 1, క్లేడ్ 2 అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఆఫ్రికాలోని కాంగోలో క్లేడ్ 1 రకం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. క్లేడ్ 2 తో పోలిస్తే క్లేడ్ 1 వేరియంట్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం అవుతున్నది. అయితే ఇప్పుడు కొత్త రకం వైరస్ క్లేడ్ 1బీ వ్యాప్తి చెందుతున్నది. ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా తేలికగా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. దీనిలో మరణాల రేటు 1-10శాతం వరకు ఉంటుందని, ఆఫ్రికాలో ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లోనే ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు.. మరణాలు కూడా వారివే ఉన్నట్ల అక్కడి వైద్యులు చెబుతున్నారు.

ఏమిటీ ఎంపాక్స్ వైరస్

మంకీపాక్స్ అనేది ఒక అర్థోపాక్స్ వైరస్. దీనిని మొదటి 1958లో కోతుల్లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు. అ తర్వాత 1970లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మనుషుల్లో కూడా కనిపించింది. మంకీపాక్స్, స్మాల్ పాక్స్ కు దగ్గరి సంబంధాలుంటాయి. ఇవి రెండు కూడా అర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినవే. ఈ వైరస్ ఎలుకలు, ఉడతలు, కుందేలు వంటి జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు గతంలోనే నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2022 నుంచి ఈ వేరియంట్‌ 116 దేశాల్లో 99,176 మందికి సోకిందని, వారిలో 208 మంది చనిపోయారని వివరించింది. ఈ సంవత్సరం కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో ఇప్పటి వరకు 15,600 కేసులు నమోదవగా 537 మంది చనిపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది.

వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన వాళ్లకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, చలి, ఆయాసం, గొంతునొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, బలహీనపడడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో ఎంపాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే, మరికొంతమందిలో అది వేరే రకంగా బయటపడొచ్చు. దద్దుర్లు పుండుగా ప్రారంభమై, ద్రవంతో నిండిన పొక్కుగా అభివృద్ధి చెందుతుంది. దద్దుర్లు నయమైనప్పుడు, పుండ్లు ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి. పుండ్లు నయమై, కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

ఇది అంటువ్యాధా?

ఎంపాక్స్ అంటు వ్యాధిలానే కనిపిస్తున్నది. కానీ కరోనా లాగా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఈ వ్యాధి సోకిన వ్యక్తిని డైరెక్ట్ గా తాకడం, ఎదురెదురుగా ఉండి మాట్లాడటం, చర్మాన్ని తాకడం, లైంగికంగా కలవడం, ముద్దు పెట్టుకోవడం, గాయాల ద్వారా కూడా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది.

వ్యాధి నివారణ ఎలా?

వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రందించాలి. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన వ్యక్తి కోలుకోవడానికి 2 నుంచి 4 వారాలు సమయం పడుతుంది. వ్యక్తి బలహీనంగా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ కాలమే ఉండవచ్చు. కాబట్టి ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడానికి ఆ వ్యక్తికి ప్రత్యేక గది ఏర్పాటు చేయాలి. లేదంటే పిల్లలు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులు ఈ వైరస్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వ్యాధి సోకిన వ్యక్తి చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో తరచు శుభ్రం చేసుకుంటు ఉండాలి. మాస్క్‌ను ధరించాలి. పోషకాహారం తీసుకోవాలి. తగినంత నీరు, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఒంటి మీది పొక్కులు బయటకు కనిపించకుండా బట్టతో కప్పిఉంచాలి. శరీరంపై ఏర్పడ్డ బొబ్బలు, పుండ్లను గీరడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి శరీరమంతా వ్యాప్తి చెందుతాయి. డాక్టరు సలహా తీసుకుని ఆసుపత్రి లేదా ప్రత్యేక గదిలో ఉంచి ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది.

గత అనుభవాలతో అలర్ట్

కరోనా మహమ్మారితో జరిగిన విధ్వంసం చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేం. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజల మరణాలకు కారణమైంది. వేలమందిని అనాథలను చేసింది. ఆర్థికంగా ప్రపంచాన్ని కుదిపేసింది. చైనాలో మొదలైన వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది. ఆ అనుభవాలతో ప్రపంచ దేశాలు కొత్త వైరస్ అనగానే అలర్ట్ అవుతున్నాయి. పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో మంకీపాక్స్ కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో భారత ప్రభుత్వం అలర్టయింది. అయితే వారు ముగ్గురు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో బయట దేశాలను వస్తున్న వారి పట్ల, సరిహద్దు దేశాల పోర్టుల దగ్గర నిఘా పెంచాలని నిర్ణయం తీసుకున్నది. మరి ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న దేశాల నుంచి వచ్చిన వారికి టెస్టులు చేసి క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఇటీవల ఆయా దేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటు వ్యాధి లక్షణాలను వివరిస్తూ అందరినీ వైద్య శాఖ అప్రమత్తం చేస్తోంది. 2022లో వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం దేశంలో 30 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతదేశంలో చివరగా 2024 మార్చిలో కేరళలో ఒక కేసు నమోదైందని సమాచారం. అయితే దేశంలో ఈ వైరస్ ప్రభావం కూడా తక్కువగానే ఉంటుదని వైద్య శాఖ చెబుతున్నది.

రెడీ టు ఫైట్​

ఒకవేళ దేశంలోకి ప్రవేశిస్తే అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్‌ చేయడానికి ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా, సఫ్దార్‌జంగ్‌, లేడీ హార్డింగే ఆస్పత్రులను ఎంపిక చేసింది. రాష్ర్టాలను కూడా సిద్ధంగా ఉండాలని చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులను సిద్ధం చేయాలని సూచించింది. రాష్ట్రాలు తగినంతగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్‌లు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 2023 జులై 24 నాటికి దేశంలో 27 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వాటిలో 12 కేసులు కేరళలో, 15 కేసులో ఢిల్లీలో బయటపడ్డాయి. దాని తర్వాత మళ్లీ ఇందుకు సంబంధించిన కేసులు బయటపడలేదు. అఫ్రికా నుంచి గల్ఫ్ దేశాలను విస్తరిస్తున్న ఈ వైరస్ మిగతా దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళనకు గురవుతున్నది.

నోడల్ కేంద్రంగా గాంధీ

ఇతర దేశాలు, పక్క రాష్ట్రాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్న తీరును గుర్తించిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆదేశాలతో హైదారాబాద్ లోని గాంధీ హాస్పిటల్ ను మంకీ పాక్స్ నోడల్ సెంటర్ గా ప్రకటించారు. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన వార్డుల్లోని ఒక దాన్ని మంకీ పాక్స్ వార్డుగా కన్వర్ట్ చేశారు. మంకీ పాక్స్ లక్షణాల బాధితులకు ఈ వార్డులో చికిత్సను అందించనున్నారు. ప్రస్తుతం 50 బెడ్లతో వార్డును సిద్ధం చేశారు. పేషెంట్ల నుంచి స్టాఫ్​కు వ్యాప్తి చెందకుండా పీపీఈ కిట్లు, గ్లవ్జ్, మాస్కులను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ కు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక బ్రీతింగ్ సమస్య వచ్చిన పేషెంట్ల కోసం వెంటిలేటర్లు, ఆక్సిజన్ పరికరాలను కూడా సిద్ధం చేశారు. మంకీ పాక్స్ తీవ్రతను వార్డులు, బెడ్ల సంఖ్యను పెంచనున్నట్లు అక్కడి డాక్టర్లు వెల్లడించారు. ఇక ఫీవర్ ఆసుపత్రిలోనూ 30 పడకలతో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ ప్రభుత్వాసుపత్రుల్లోనూ 10 నుంచి 20 పడకలతో స్పెషల్ వార్డులను సిద్ధం చేయబోతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

సెక్స్‌వల్ ట్రాన్స్‌మిషనే ఎక్కువ: ప్రొఫెసర్ కిరణ్​మాదాల, గాంధీ హాస్పిటల్

‘మంకీ పాక్స్ రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. ప్రపంచాన్ని భయపెట్టే టాప్ 10 వ్యాధుల్లో మంకీ పాక్స్ కూడా ఒకటని హెచ్చరించింది. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఒక మనిషి నుంచి మరొకరికి సెక్స్‌వల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వ్యాప్తి చెందినట్లు పేషెంట్ల కేసు హిస్టరీలు స్పష్టం చేస్తున్నాయి. మన‌దేశంలో మాత్రం దీని వ్యాప్తి తక్కువగానే ఉండవచ్చు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. స్మాల్ పాక్స్ తరహాలోనే సింప్టమ్స్ ఉంటాయి. చిన్నప్పుడు వేసిన కొన్ని రకాల టీకాలు కొంత వరకు అడ్డుకుంటాయి. పూర్తిస్థాయిలో సమర్ధవంతంగా పనిచేసే వ్యాక్సిన్ల కోసం వివిధ దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి.’

ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్లు అలర్ట్: డాక్టర్ రాజీవ్, క్రిటికల్ కేర్ ఎక్స్‌పర్ట్

‘ఆఫ్రికా ఖండంలో కేసులు ఎక్కువగా రికార్డు అవుతుండటంతో డబ్ల్యూహెచ్ వో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మంకీ పాక్స్ స్పష్టంగా అంటు వ్యాధి. జంతువుల నుంచి మనుషులకు అంటుకోవడం, మనిషి నుంచి మరోక వ్యక్తికి వ్యాప్తి చెందుతుంటుంది. చాలామందికి వేగంగానే తగ్గిపోతుంది. కానీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న దీర్ఘకాలిక రోగులు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉండే ప్రమాదం ఉన్నది. వ్యాధి తీవ్రత పెరిగితే నిమోనియో, ఇంటర్నల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, గుండె, లంగ్స్‌తో పాటు కంటి సమస్యలకు ఆస్కారం ఉన్నది. మంకీ పాక్స్‌కు ఇప్పటి‌వరకు స్పష్టమైన మందులేవీ లేవు. కానీ లక్షణాలను బట్టి యాంటీవైరల్ డ్రగ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.


Similar News