MMTS Services: నగరవాసులకు భారీ గుడ్‌ న్యూస్‌.. రాత్రి పూట ఎంఎంటీఎస్‌ సేవలు!

హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్‌ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-09-13 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వాసులకు ఎంఎంటీఎస్‌ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే సేవలందించే ఎంఎంటీఎస్‌ ఓ రెండు రోజుల పాటు నైట్ టైమ్ కూడా సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో 2 రోజుల పాటు 24 గంటల పాటు నిరంతరాయంగా సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే, హైదరాబాద్‌లో ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు ప్రత్యేకంగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో పలు జిల్లాల నుంచి భక్తులు హస్సేన్ సాగర్‌ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. నిమజ్జన సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా భారీగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా నిమజ్జనానికి సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ క్రమంలో నగర ప్రజలతో పాటు ఆయా జిల్లాల భక్తులకు 2 రోజుల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉండనున్నాయి.

17న రాత్రి 11.10కి నిమిషాలకు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి, అదే రోజు రాత్రి 11.50 నిమిషాలకు సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్‌ కు, 18న అర్థరాత్రి 12.10కి లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా, 18న రాత్రి 12.30కి హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి, 18న ఉదయం 1.50కి లింగంపల్లి నుంచి నుంచి హైదరాబాద్‌, 18న రాత్రి 2:20కి ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌‌, 18న రాత్రి 3:30కి హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్, 18న ఉదయం 4:00 గంటలకు సికింద్రాబాద్‌‌ నుంచి హైదరాబాద్‌‌‌కు ఎంఎంటీఎస్ సర్వీసులు నడవనున్నాయి.


Similar News