రేపే ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఇప్పటికే నగరానికి చేరుకున్న సీబీఐ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Update: 2022-12-05 15:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో భాగంగా శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో-విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంటూ సీబీఐ ఈ నోటీసుల్లో పేర్కొంది. ఈనెల 6వ తేదీన ఆమెను సీబీఐ విచారించనుంది. అయితే, విచారణ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నట్లు సమాచారం. ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రం నలుగురు అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. మరోపక్క విచారణ తేదీని ఖరారు చేయడానికి కవిత షరతులు పెట్టిన విషయం తెలిసిందే. నోటీసులు అందిన తరువాత సీబీఐ అధికారులకు కవిత లేఖ రాశారు.

జారీ అయిన నోటీసుల్లో పొందుపరిచిన అంశాలకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తనకు అందజేయాలని కోరారు. వీలైనంత త్వరగా వాటిని పంపించాలని, దీనివల్ల విచారణకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి, తగిన సమాధానాలను ఇవ్వడానికి తనకు వీలుగా ఉంటుందని చెప్పారు. అయితే, ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ, నోటీసుల్లో పొందుపరిచిన డాక్యుమెంట్లు అందజేయకుండానే విచారణ నిమిత్తం అధికారులు నగరానికి రావడం కలకలం రేపుతోంది. 11, 12, 14, 15వ తేదీల్లో ఏరోజైనా తాను విచారణ నిమిత్తం అధికారులకు సహకరిస్తానని ఇప్పటికే కవిత సైతం చెప్పగా, అవేమీ పట్టించుకోకుండా 6వ తేదీనే విచారించడానికి 5వ తేదీన అధికారులు నగరానికి చేరుకోవడంతో రాష్ట్రంలో పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయో అని తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌‌లో కల్వకుంట్ల కవిత పేరును ఈడీ ప్రస్తావించారంటూ వార్తలొచ్చిన మరుసటి రోజే సీబీఐ ఆమెకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News