టీఆర్ఎస్‌లో కొత్త చర్చ.. MLC Kavitha Kalvakuntla ఎక్కడ?

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా టెన్షన్ పెట్టిస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ బై పోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Update: 2022-11-03 09:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయంగా టెన్షన్ పెట్టిస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ బై పోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తప్పక గెలవాలనే పట్టుదలతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు పోలింగ్ చివరి వరకు ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే పట్టుదలతో ఉన్నాయి. దీంతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. అయితే అధికార పార్టీకి అత్యంత కీలకమైన ఈ ఉప ఎన్నిక వేళ మొదటి నుంచి ఓ కీలక నేత దూరంగా ఉండటం టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు నేత మునుగోడు వరకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారా లేక భవిష్యత్‌లోనూ ఇదే పంథాలో వ్యవహరిస్తారా? సదరు నేత రాజకీయ అజ్ఞాతం వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉందా? ఒక వేళ కేసీఆర్ వ్యూహంలో భాగమే అయితే ఎన్నాళ్లీ అజ్ఞాతం అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.

కీలక సమయంలో డుమ్మా!:

టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీశ్ రావుతో సమానంగా ఫాలోయింగ్ కలిగిన నేతగా కల్వకుంట్ల కవితకు పేరు ఉంది. జాగృతి పేరుతో ఆమె పార్టీవైపు మహిళ ఓటర్లను ఆకర్షించండంలో సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది. అలాంటి కవిత గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశం అవుతోంది. తనను నిజామాబాద్‌లో ఓడించిన కారణం చేత బీజేపీ పేరు చెబితేనే ఆగ్రహం వెళ్లగక్కుతున్న కవిత.. మునుగోడులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతుంటే పార్టీని గెలిపించడం కోసం మాత్రం ముందుకు రాలేదు. తమ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించలేదు. ఓ వైపు తన సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావులు ప్రచారం హోరెత్తిస్తుంటే కవిత మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. అయితే ఆమెపై ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు రావడంతోనే కేసీఆర్ ఆమెను ప్రచారానికి దూరంగా ఉంచారనే టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ, పార్టీలో కీలంగా ఉన్న కవిత ఇలా ప్రత్యర్థుల ఆరోపణలకే రాజకీయ యుద్ధరంగానికి దూరంగా ఉండటం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాబోయే ఎన్నికలకు మునుగోడు ఫలితం ఓ గీటురాయి కాబోతుందనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత కనీసం సోషల్ మీడియాలోనూ పార్టీకి ఓటు వేయాలని కోరలేదు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులందరినీ మునుగోడులో మోహరింపచేసిన కేసీఆర్ కవిత విషయంలో మాత్రం మరోలా వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చగా మారింది.

నేటితో మౌనం వీడేనా?:

లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కొంత కాలంగా కవిత పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఆరోపణలపై ఆరంభంలో కొంత స్పందించే ప్రయత్నం చేసినా అది బెడిసికొడుతుందని, కవిత ప్రత్యర్థులపై ఎదురు దాడికి దిగితే అది పార్టీకే మైనస్ అవుతుందని గ్రహించిన కేసీఆర్.. ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కార్యక్రమానికి సైతం కవిత దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ తో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం అనంతరం ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టి రావడం వరకే పరిమితం అయిన కవిత.. రాజకీయంగా మౌనంగా ఉండిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కవిత అక్కడ కూడా సైలెంట్ మోడ్‌లోనే ఉంటున్నారు. మునుగోడు పోలింగ్ ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం నుంచి నేతలు చేసే వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపుతాయన్న భ్రమలు ఏమీ ఉండవు. ఇన్నాళ్లు లిక్కర్ స్కామ్ ఆరోపణల కారణంగా మునుగోడు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కవిత ఇవాళ పోలింగ్ అయిపోవడంతోనైనా కవిత నోరు విప్పుతారా అనేది ఉత్కంఠగా మారింది. మునుపటిలా చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం చూడవచ్చా అనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మునుగోడు: పోలింగ్‌ రోజునే టీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు

Tags:    

Similar News