సకాలంలో స్పందించి ఉంటే.. ఇంత ఘోరం జరిగేది కాదు: జీవన్ రెడ్డి
సకాలంలో కాలేజ్ యాజమాన్యం, పోలీసులు స్పందించి ఉంటే వైద్య విద్యార్థిని ప్రీతి మరణించేది కాదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: సకాలంలో కాలేజ్ యాజమాన్యం, పోలీసులు స్పందించి ఉంటే వైద్య విద్యార్థిని ప్రీతి మరణించేది కాదని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రీతి మరణం పట్ల ఆయన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్‌కు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజ్ యాజమాన్యం, పోలీసులు సకాలంలో స్పందించి.. వేధింపులకు పాల్పడిన యువకుడిని మందలించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. బాధితురాలి తండ్రి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రీతి మరణం విషయంలో మట్టెవాడ పోలీస్ అధికారి, కాలేజ్ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీని నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రీతిది కుబుంబ సభ్యులు హత్య అని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కేసును సిట్ విచారణ జరిపించాలన్నారు. ఈ ఘటన మరువకముందే వేధింపులు తట్టుకోలేక రక్షిత అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని.. ఈ కేసులో కూడా భూపాలపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటించలేదని.. భారత్ జోడో యాత్ర సఫలం కావడంతో ప్లీనరీ సమావేశాల్లో సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీలో పదవి, హోదా లేకపోయినా ఆమె గైడ్‌గా ఉంటుందని స్పష్టం చేశారు.