నా ప్రశ్నకు జగిత్యాల అడిషనల్ కలెక్టర్ సమాధానం చెప్పాలి.. MLC జీవన్ రెడ్డి సీరియస్

అడుగడుగునా గుంతలతో జగిత్యాల బైపాస్ రోడ్డు అధ్వాన్నంగా తయారైందని, అయినా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు మొదలు పెట్టడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2022-10-16 13:12 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: అడుగడుగునా గుంతలతో జగిత్యాల బైపాస్ రోడ్డు అధ్వాన్నంగా తయారైందని, అయినా అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు మొదలు పెట్టడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ ప్రజలతో పాటు నిత్యం ప్రజాప్రతినిధులు ప్రయాణించే రోడ్డు గుంతలమయంగా మారినప్పటికి పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వాహనదారుల కష్టాలు వారికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నాలుగు నెలల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు మొదలు పెట్టకపోవడంలో ఉన్న సమస్య ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించడంలో భాగంగా బైపాస్ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటి రోడ్డుకు నిధులున్న పనులు ఎందుకు మొదలుపెట్టట్లేదని ప్రశ్నించారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్థానిక సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్‌ని నియమించినప్పటికీ జిల్లా కేంద్రంలో అధిక ప్రాధాన్యత ఉన్న పనిని పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల బైపాస్ రోడ్ దుస్థితి సబ్ కలెక్టర్ దృష్టికి రాలేదా? వచ్చిన ఉపేక్షిస్తున్నారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులు మంజూరైన బైపాస్ రోడ్డు పనులు చేపట్టకపోవడంపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల్లో తక్కువగా ఉంటూ ట్విట్టర్ లోనే కాలం గడుపుతూ ట్విట్టర్ మంత్రిగా పేరు పొందాడని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ మధు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News