ఆ కేసులో ఇరికించేందుకే ఈడీ విచారణ: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈడీ విచారణకు పూర్తిగా సహకరించినప్పటికీ అధికారులు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఈడీ విచారణకు పూర్తిగా సహకరించినప్పటికీ అధికారులు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల ఈడీ విచారణ ఎదుర్కొన్న పైలెట్ రోహిత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చేతిలో ఉన్న ఈడీ ద్వారా తనకు నోటీసులు పంపించి విచారణ జరిపించారని.. దర్యాప్తు పేరుతో ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెట్టాలని చూశారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. మొదటి రోజు ఆరు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ.. అసలు ఏ కేసుల గురించి ప్రశ్నిస్తున్నారో కూడా చెప్పలేదని అన్నారు. రెండవ రోజు విచారణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి ప్రశ్నించారని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో ఎక్కడ మనీలాండరింగ్ జరగలేదని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ నేతల బండారం బయటపెట్టాననే తనపై కక్ష గట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
కేవలం తనను లొంగదీసుకోవడం కోసమే ఈడీ విచారణ జరిపించారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు చేసిన తనను ప్రశ్నించారు కానీ.. నిందితులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ ద్వారా నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని.. ఇందులో భాగంగానే రూట్ మార్చిన ఈడీ ఇప్పుడు నందకుమార్‌ను విచారించాలని చూస్తోందని అన్నారు. వాళ్ల ప్లాన్‌లో భాగంగా నందకుమార్ ద్వారా స్టే్ట్ మెంట్ ఇప్పించి.. తనను ఇరికించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ కుట్రలను మేము భగ్నం చేస్తామని స్పష్టం చేశారు. ఈడీ తీరుపై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నానని తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ అనే త్రిశూలం ద్వారా కేంద్రం దాడి చేస్తోందన్నారు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు.