బీసీలకు రూ.1 లక్ష లోన్లు వట్టి ముచ్చటే.. అదంతా ఎలక్షన్ స్టంట్: MLA రాజాసింగ్
వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను నమ్మి ఓట్లేస్తే మోసపోయేది వారేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను నమ్మి ఓట్లేస్తే మోసపోయేది వారేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక జీవో విడుదుల చేసిందని, కుల వృత్తుల వారికి రూ.1 లక్ష లోన్ అంటూ బీఆర్ఎస్ చెబుతోందని, అయితే బీసీలో 41 కేటగిరీలకు మాత్రమే లోన్ ఇస్తామని ఆ జీవోలో ఉందన్నారు. వాస్తవానికి బీసీలో మొత్తం 130 కేటగిరీలున్నాయని, కొందరికే లోన్లు ఇస్తే మిగిలిన వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మిగిలిన కేటగిరీల్లో బీఆర్ఎస్ సర్కార్‌కు పేదలు కనిపించలేదా అని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఎలక్షన్ స్టంట్‌గా ఆయన పేర్కొన్నారు. గతంలో ఇలా కాంగ్రెస్ చేసేదని చెప్పారు. రూ.1 లక్ష లోన్ ఇస్తారనే గ్యారెంటీ కూడా లేదని, లోన్ వంద శాతం ఇవ్వరని తెలిపారు. ఎందుకంటే తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయిందని, కాంట్రాక్టర్లకు, వర్కర్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా అందని పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందన్నారు. తెలంగాణను జీరో చేశారని ఆయన విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ మాయలో పడొద్దని ఆయన సూచించారు.
తెలంగాణ ఇప్పటికే అప్పుల పాలైందని, కేసీఆర్ ఈసారి అధికారంలోకి వస్తే తెలంగాణను అమ్మేస్తారన్నారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే నష్టపోయేది ప్రజలేనని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గానికి రూ.10 లక్షలు అందిస్తున్నారని, మరి మిగతా వారికెందుకు ఇవ్వడంలేదని రాజాసింగ్ ప్రశ్నించారు. రూ.10 లక్షలు కేసీఆర్ తన జేబులో నుంచి ఇవ్వట్లేదని, అది బీఆర్ఎస్ ఫండ్ కూడా కాదని, ప్రజలు కట్టే పన్నులనే తిరిగి ఇస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.