KCR చేసిన పాపానికి ప్రమాదంలో సింగరేణి: MLA కూనంనేని

కేసీఅర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Update: 2024-06-26 16:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఅర్ చేసిన పాపానికి సింగరేణి ప్రమాదంలో పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ.. సింగరేణిని అదానీ, అంబానీలు కొనుగోలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని, ఈ కుట్రకు కేసీఆర్ సహకరించారని, సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. సింగరేణిలేని తెలంగాణను ఊహించుకోలేమని ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయి.. గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామన్నారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహరించారని, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ రాసిచ్చారని ఆరోపించారు. బొగ్గు గనులను ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారు.. ఇప్పటికే కోయగూడెం ఇచ్చేశారని తెలిపారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని కిషన్ రెడ్డి చెప్పారని, సింగరేణి కాలరీస్‌ను ప్రైవేట్ పరం చేయమని చెప్పి.. ఇటీవల కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాద్యత చేపట్టిన కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పాడని అన్నారు. తాజాగా కొత్త బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించే మోదీ కుట్రలో కిషన్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని అన్నారు. కిషన్ రెడ్డి సౌమ్యుడుగా ఇన్ని రోజులు అనుకున్నాము కానీ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన బొగ్గు గనుల లీజు రద్దు చేయాలని, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు కిషన్ రెడ్డి సిగ్గుపడాలన్నారు. సింగరేణినీ కాపాడాల్సిన బాధ్యత సీపీఐపైన ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని, ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వం పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు.

జులై 5న బంద్

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కొత్త బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై 5వ తేదీన “కోల్ బెల్ట్ బంద్ నిర్వహించనున్నట్లు సీపీఐ, సింగరేణి గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎస్ఎఐటియుసి అనుబంధం) ప్రకటించాయి. సింగరేణి కార్మికుల ఉద్యమానికి మద్దతుగా కార్మికులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుంచి 15 రోజుల పాటు నిరసన ప్రదర్శనలు, నిరహార దీక్షలు, జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించాయి.

Similar News