సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా సొంత పార్టీ ఎమ్మెల్యే తీరు!

తెలంగాణలో మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు సొంత పార్టీ నేతల తీరు సమస్యగా మారుతోంది.

Update: 2023-04-20 10:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కు సొంత పార్టీ నేతల తీరు సమస్యగా మారుతోంది. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా సొంత పార్టీ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదం అవుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దౌర్జన్యాలు, ఆగడాలు పేట్రేగిపోతున్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న తరుణంలో కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఏకంగా సొంత పార్టీకి చెందిన నాయకుడు సామ దామోదర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిస్తానని నమ్మించి శంకర్ పల్లిలోని 113 ఎకరాల తన స్థలాన్ని అక్రమంగా జీవన్ రెడ్డి తన పేరు మీద రాయించుకున్నాడని సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. అంతే కాదు ఈ విషయంలో ప్రశ్నిస్తే లారీలతో తొక్కించి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి మరీ దామోదర్ రెడ్డి చేసిన విమర్శలు ఇటు బీఆర్ఎస్‌తో పాటు విపక్షాల్లోను చర్చగా మారింది.

యువజన విభాగం నుంచి బీఆర్ఎస్‌లో పనిచేసిన జీవన్ రెడ్డి.. క్రమంగా ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. నియోజకవర్గ సమస్యలపై ఓ నిమిషం ఆలస్యం అవుతాడేమో కానీ కేసీఆర్‌పై గానీ, ఆయన కుటుంబంపై గానీ ఏ చిన్న ఆరోపణల వచ్చినా జీవన్ రెడ్డి ఊరుకోరనే టాక్ ఉంది. అలాంటి జీవన్ రెడ్డిపై తాజా వచ్చిన ఆరోపణలు కేసీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. భూకబ్జాలు, హత్యలు, ఆరోపణలు, బెదిరింపులు ఇలా అన్ని రకాల కేసుల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉంటోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే సొంత పార్టీ నేతలపై ఇన్ని విమర్శలు వస్తున్నా వారిని అధినేత కేసీఆర్ మాత్రం కంట్రోల్ చేయలేక పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీ నేతలపై ఆరోపణలు తీవ్రతరం కావడంతో.. ఇది ఎన్నికల సమయం అని అంతా కడుపు కట్టుకొని నిబద్ధతతో పని చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇంకోలా కనిపిస్తున్నాయి. అధినేత ఎన్ని సార్లు వారించినా నేతల తీరు మారకపోవడం పార్టీలో క్రమశిక్షణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దనే బాస్ ఆలోచనలను పెడచెవిన పెడుతున్న కొంతమంది నేతలు తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజాగా జీవన్ రెడ్డి వ్యవహారమే ఉదాహరణ అనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్న తరుణంలో కేసీఆర్‌కు నమ్మిన బంటుగా ఉన్న జీవన్ రెడ్డిపై ఇంతటి తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం పొలిటికల్ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. నేతల పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్ ఆశలు అడియాశలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో కేసీఆర్ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న వేళ.. జీవన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు పార్టీకి ఏమేరకు డ్యామేజ్ కలిగిస్తుందనేది చర్చగా మారింది.

Tags:    

Similar News