బీఆర్ఎస్ లో ముఖ్యనేతల మిస్సింగ్!..హాట్ టాపిక్ గా ఆ నేతల తీరు

అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో ఆ నేతల మౌనం పట్ల జోరుగా చర్చ జరుగుతోంది.

Update: 2024-01-30 11:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం మామూలే. అధికారంలో ఉండగా అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితులు అధికారం కోల్పోగానే ఒక్కసారిగా తారుమారు అవుతాయి. తాజాగా బీఆర్ఎస్ లో అదే పరిస్థితి కనిపిస్తోంది. గులాబీ పార్టీలో ముఖ్యనేతలు మిస్ అవుతున్నారు. అంటే పార్టీలో ఉన్నప్పటికీ సైలెంట్ మోడ్ లో కొనసాగుతున్నారు. అధికారంలో ఉండగా హడావిడి చేసి పార్టీలో అంతా మేమే అన్న రేంజ్ లో చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు కనిపించకపోవడం కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలో ఏం జరగబోతున్నదన్న చర్చ ఆసక్తిగా మారింది.

అప్పట్లో ఓ వెలుగు వెలిగి:

గులాబీ పార్టీ అంటే ఓ క్రమశిక్షణకు మారుపేరు అనే టాక్ ఉండేది. అలాంటి పార్టీలో ప్రస్తుతం పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ ఓటమికి అధిష్టానం వైఖరియే కారణం అని నాయకులు విమర్శలు గుప్పిస్తుంటే అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశం అవుతున్నది. ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, ఐకే రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గత టర్మ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన శంకర్‌నాయక్, రసమయి, గంప గోవర్ధన్, గువ్వల బాలరాజు, గాదరి కిశోర్, గొంగిడి సునీత, ఆశన్నగారి జీవన్‌రెడ్డి తదితర నేతలంతా ప్రస్తుతం సైలెంట్ అయ్యారనే టాక్ ఆ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తొమ్మిదిన్నర ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ లో వీరిలో కొందరు ఒక రేంజ్ లో హడావిడి చేశారనే టాక్ ఉంది. ముఖ్యంగా కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకక పార్టీలోని సీనియర్లే తంటాలు పడుతున్న సందర్భాలలో వీరు మాత్రం కేసీఆర్, కేటీఆర్ తో నిత్యం టచ్ లో ఉండేవారనే టాక్ ఉంది. అటువంటి నేతలు కొత్త ప్రభుత్వం రాగానే కొందరు అడపదడపా స్పందించినా మరి కొందరు మాత్రం పూర్తిగా కనిపించకుండా పోయారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో ఎమ్మెల్సీ నవీన్ అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారనే చర్చ ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రిగా పువ్వాడ అజయ్ చక్రం తిప్పారు.కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా అక్కడ వేముల ప్రశాంత్ దర్శనం ఇచ్చేవారు. వీరితో పాటు కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న నేతల్లో కొందరు మౌనం వహించడం చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వంపై విమర్శల విషయం ఎలా ఉన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అధికార పక్షం ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నా ఆ విమర్శలను తిప్పికొట్టలేక మౌనం వహిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఖమ్మం టౌన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ను పోలీసులు అరెస్ట్ చేస్తే కనీసం ఖండించలేదనే విమర్శలు మాజీ మంత్రి పువ్వాడపై వినిపిస్తున్నాయి.

నేతల సైలెంట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు?:

అధికారంలో ఉండగా కీలక పదవులు, పెద్దలతో సన్నిహితంగాఉన్న నేతలు కొత్త ప్రభుత్వంలో సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు కారణమా అనే చర్చ తెరపైకి వస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల్లోని అక్రమాలపై గురి పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ పక్కల భూముల వ్యవహారాల్లో అక్రమాలను రేవంత్ రెడ్డి సర్కార్ వెలికి తీసే ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లోని కొందరు నేతలు మౌనానికి ప్రభుత్వం దూకుడు ఒక కారణం అని కొత్త ప్రభుత్వంతో దుందుడుకు నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో జాగ్రత్త పడే పనిలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు మౌనం వహిస్తున్నారా లేక రాజకీయ కారణాలతోనే ఇన్ యాక్టివ్ అవుతున్నారా అనేదానిపై రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News