ఆ మంత్రికి సొంత పార్టీ నేతలే మైనస్! ఎఫెక్ట్ తప్పదా?

మంత్రి కొప్పులకు గడ్డుకాలం తప్పేలా లేదు.

Update: 2023-03-20 03:16 GMT

దిశ, గొల్లపెల్లి : మంత్రి కొప్పులకు గడ్డుకాలం తప్పేలా లేదు. రాజకీయాలలో అపార అనుభవం ఉన్న కొప్పుల ఈశ్వర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి విప్‌గా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో చావుతప్పి కన్ను లొట్టబోయిందా అన్నట్లుగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌పై తక్కువ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని గ్రామాలలో కలియ తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మండలంలోని కొంతమంది ద్వితీయ శ్రేణి క్యాడర్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మంత్రి కొప్పులకు రాజకీయ ఇబ్బందులు తెచ్చి పెడుతోందనే చర్చ ఉపందుకున్నది. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈసారి ఎలాగైనా గెలిచే తీరాలని సానుభూతి ఓట్ల కోసం వ్యూహ రచన చేస్తున్నారని సమాచారం. లక్ష్మణ్‌ను ఢీ కొట్టేందుకు కొప్పుల సిద్ధంగానే ఉన్నప్పటికీ సొంత పార్టీకి చెందిన కొంతమంది నాయకుల తీరే ఆయనకు ఓటమిని కట్టబెట్టేలా ఉందని బీఆర్ఎస్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే కొప్పుల ఈశ్వర్ స్థానంలో మరో అభ్యర్థిని ధర్మపురి బరిలో ఉంచి కొప్పులను చొప్పదండి నుంచి పోటీలో ఉంచాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ నాయకుల వల్లేనా..?

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పనిచేసిన కొప్పుల ముఖ్యమంత్రికి సన్నిహితుడని పేరుంది. అయితే ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా అనుచరులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని కట్టడి చేయడంలో విఫలం అయ్యారని రాజకీయ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమ దందాలు ల్యాండ్ సెటిల్ మెంట్లు కారణంగా కొప్పులకు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. గతంలో కూడా నమ్మిన వాళ్లే ప్లేట్ ఫిరాయించడంతో తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నారన్న ప్రచారం జరిగింది.

అంతేకాకుండా మంత్రి పేరు చెప్పి పైరవీలు, కబ్జాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో గొల్లపల్లి మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఓ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తమకు మంత్రి అండదండలు ఉన్నాయని తమను ఎవరు ఏమీ చేయలేరని బహిరంగంగానే చెప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ఇలా సెకండ్ క్యాడర్ నాయకులు చేసే అక్రమాలకు మంత్రి పేరు వాడుకుంటున్నారని వాస్తవానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేకున్నా ఇరుకునే పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.

అభివృద్ధికి మోకాలడ్డు..?

ఓ వైపు మంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్తుంటే నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో మాత్రం స్థానిక నాయకులు కమీషన్ల కక్కుర్తి వేటలో ఆ పనులను ముందుకు సాగకుండా మోకాలు అడ్డుపెడుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పనులకు కాంట్రాక్టులు దక్కని నాయకులు సైతం ప్రతిపక్ష నాయకులతో కుమ్మక్కై వారితో పనులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. మాట తక్కువ పని ఎక్కువ అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పేరు ఉన్నప్పటికీ కొంతమంది నాయకుల వ్యవహరిస్తున్న తీరుతో వచ్చే ఎన్నికలలో ధర్మపురిలో కారుకు కష్టాలు తప్పవని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే సెకండ్ కేడర్ అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కొప్పుల వ్యతిరేకతను అనుకూలంగా ఎలా మార్చుకుంటారనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News