కాళేశ్వరం అక్రమాలపై విజిలెన్స్ విచారణ మొదలైంది: ఉత్తమ్
కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై మంత్రి సమీక్షించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై ఇంజినీర్లతో చర్చించిన మంత్రి జూన్ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్ నాటికి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సకాలంలో నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు ఎక్కువ అప్పులు చేశారని ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు చేసినా దానికి తగిన ఫలితాలు లేవన్నారు. అందువల్ల అవసరం మేరకే వ్యయం చేసి ఆయకట్టు నిర్మించాలని, కొత్త ఆయకట్టు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంథని నియోజకవర్గానికి నీరు ఇచ్చే పనులు మొదలు పెట్టాలని ఆదేశింంచారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్ సీలు, సీఈలు పాల్గొన్నారు.