పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లు ఇవే: మంత్రి ఉత్తమ్
పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గా అభివృద్ధికి రూ.కోటి రూపాయలు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ మరింత బలహీనపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను గెలుచుకోబోతోందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందని అన్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని తెలిపారు. ఎవరినీ వదిలిపెట్టబోమని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
అవినీతి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు నిధుల విడుదలపై బీఆర్ఎస్ నాయకులు ఇంకా అబద్ధాలు ఆడుతున్నట్లు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పినా మార్పు రావడం లేదని అన్నారు. ఇదే అహంకారం కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం అవుతుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలన ప్రజలను మోసం చేసి ప్రజా సంపదను దోచుకుందని అన్నారు. తెలంగాణను అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. 50 రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించామని అన్నారు. ఈ సమీక్ష సమావేశాలలో వెల్లడైన అంశాలు దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు.