తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటా: మంత్రి తుమ్మల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కీలక నేత తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కీలక నేత తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్‌పై 50 వేల పైచిలుకు ఓట్లతో సూపర్ విక్టరీ సాధించారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కట్టబెట్టింది. ఆయన గెలుపునకు కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు స్థానిక టీడీపీ శ్రేణులు కూడా అంతే శ్రమించారని తుమ్మల అభిప్రాయపడ్డారు. తాజాగా.. ఆయన టీడీపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకు సోమవారం తుమ్మల తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి మంత్రి తుమ్మల వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఏ పార్టీలో ఉన్నా నందమూరి తారక రామారావు ఆశయం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతలు చెప్పారు. పేదలే దేవుళ్లు సమాజమే దేవాలయమనే నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. తెలుగువారి కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని చెప్పారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ రూపకల్పన చేయగా దేశవ్యాప్తంగా మార్గదర్శిగా మారారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం స్థలం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణులు నిబద్దతగా పనిచేశారన్నారు. ఎన్నికల్లో నా గౌరవం నిలబెట్టిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.