Minister Sridhar Babu: తెలంగాణలో అనుకూల వాతావరణం ఉంది

భారీ పెట్టుబడులు(investments), ఆవిష్కరణలకు తెలంగాణలో అనూకుల వాతావరణం ఉందని, వాహనాల ఉత్పత్తి రంగంలో రాబోయే రోజుల్లో రాష్ట్రం కీలకంగా అవతరిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు.

Update: 2024-11-06 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ పెట్టుబడులు(investments), ఆవిష్కరణలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని, వాహనాల ఉత్పత్తి రంగంలో రాబోయే రోజుల్లో రాష్ట్రం కీలకంగా అవతరిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. ‘డెన్సో’ లాంటి అగ్రగామి సంస్థ రాకతో రాష్ట్రం వాహనాల తయారీ రంగంలో సుస్థిర ఆవిష్కరణలతో మరింత ముందుకు దూసుకెళ్తుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘డెన్సో’ రాకతో ప్రపంచ ఆటో మొబైల్ రంగం మన రాష్ట్రం వైపు చూస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జపాన్‌కు చెందిన వాహనాల విడిభాగాల తయారీ సంస్థ డెన్సో స్టార్టప్ ఇన్ క్యూబేటర్, టీ-హబ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. డెన్సో రాకతో వాహన పరిశ్రమ రూపు రేఖలు మారతాయని, రాష్ట్రంలోని ఆటోమొబైల్ డిజైన్, చిప్‌ల తయారీ, సెన్సార్ ఇంజినీరింగ్ సంస్థలు ఆటోమోటివ్ రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని శ్రీధర్ బాబు అన్నారు.

ఆటోమొబైల్ రంగంలో మనదేశం ఇప్పటికే ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, ఎక్సైడ్, అమర రాజా బ్యాటరీస్ వంటి దిగ్గజ సంస్థలు అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పడం ద్వారా, సంప్రదాయ ఆటోమోటివ్ కాంపోనెంట్స్, నూతన ఎలక్ట్రిక్ వాహన సాంకేతికతలకు తెలంగాణ ప్రముఖ కేంద్రంగా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డెన్సో భారత ప్రాంతీయ సీఈవో యశుహిరో లిడా, డైరెక్టర్ ఎయిజీ సోబుయే, వైస్ ప్రెసిడెంట్ తొమొనొరి ఇనుయె, నవీన్ వర్మ, టీ హబ్ సిఈఓ సుజిత్ జాగిర్దార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఐటీ, వాణిజ్య విభాగం ముఖ్య వ్యూహకర్త శ్రీకాంత్ లంకా, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News