ఏసీ గదులే కాదు.. అప్పుడప్పుడు అడవులకూ వెళ్లండి : మంత్రి సీతక్క

ఏసీ గదులకే పరిమితం కాకుండా, అప్పుడప్పుడు అడవులకూ వెళ్లాలని మంత్రి సీతక్క ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

Update: 2024-10-18 14:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఏసీ గదులకే పరిమితం కాకుండా, అప్పుడప్పుడు అడవులకూ వెళ్లాలని మంత్రి సీతక్క ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి పీల్చడం వలన 30 శాతం ఆయుష్షును పెంచుకోవచ్చని ఆమె వెల్లడించారు. శుక్రవారం సీతక్క హైదరాబాద్‌లో సాప్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు నిర్వహించిన సెమినార్‌లో పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీ ఏరియాల డెవలప్‌కు సాప్ట్‌వేర్, కార్పొరేట్ సంస్థలు సహకరించాలని కోరారు. ఒక్కొ కంపెనీ ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్‌కు ప్రయారిటీ ఇవ్వాలన్నారు.

సారం లేని భూమి విద్య లేని జీవితం ఒకటేనని వివరించారు. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనేనని, సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నాయని, దీని వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అందుకే విద్యలో సమానత్వ సాధనను సృష్టించాలని, హైదరాబాద్‌లోని ఎడ్యుకేషన్‌ను జిల్లాల్లోనూ అందించాలని ఆకాక్షించారు. అచ్చంపేట, ఆదిలాబాద్, ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి, డిజిటల్ ఎడ్యుకేషన్‌కు కృషి చేయాలని సాప్ట్‌వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలను కోరారు.


Similar News