రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ పై మంత్రి సీతక్క మౌనం వీడాలి

రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను గతంలో సీతక్క వ్యతిరేకించారని, మరి మంత్రిగా ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు.

Update: 2024-09-26 15:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను గతంలో సీతక్క వ్యతిరేకించారని, మరి మంత్రిగా ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. సీతక్క మౌనం వీడాలని కోరారు. తెలంగాణ భవన్ లో గురువారం ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామప్ప ఆలయాన్ని 800 ఏళ్ల క్రితం నిర్మించారన్నారు. కేసీఆర్ పాలనలో 2021లో యునెస్కో గుర్తింపునకు నోచుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామప్ప దేవాలయం దగ్గర బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు రహస్యంగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దీంతో రామప్ప గుడి కి పెను ముప్పు వాటిల్ల బోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవేళ బొగ్గు గని అక్కడకు వస్తే రామప్పకు యునెస్కో గుర్తింపు రద్దవుతుందని, ఇది దేశానికే చెడ్డ పేరు తెస్తుందన్నారు. సంపద కోసం వారసత్వ సంపదను పణంగా పెట్టే యోచనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరం అయితే రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ అడ్డుకోవడానికి కోర్టు తలుపులు తడతామని హెచ్చరించారు. రేవంత్ సర్కార్ ఢిల్లీ సుల్తాన్ ల కన్నా అధ్వాన్నంగా మారుతోందని ఆరోపించారు. వరంగల్ పోరాటాల గడ్డ ..మా జోలికి రావద్దన్నారు. ఓపెన్ కాస్ట్ మెన్ల ప్రతిపాదన విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలతో పర్యాటక రంగం ప్రమాదంలో పడేలా ఉందని పేర్కొన్నారు.


Similar News