Seethakka: పోడు పట్టా నా తండ్రి హక్కు.. ఎవరూ దానం చేయలే
“నా తండ్రికి హక్కు ప్రకారమే పోడు పట్టా వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇచ్చారు. ఎవరూ దానం చేయలేదు. బీఆర్ఎస్ పదే పదే ఇదే అంశంపై మాట్లాడుతున్నారు” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: “నా తండ్రికి హక్కు ప్రకారమే పోడు పట్టా వచ్చింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇచ్చారు. ఎవరూ దానం చేయలేదు. బీఆర్ఎస్ పదే పదే ఇదే అంశంపై మాట్లాడుతున్నారు” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీల కోసం 2006లో పోడు భూముల చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా అనేక గిరిజనులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. అదే తరహాలో తన తండ్రికి వచ్చిందన్నారు. తాను అడవిలో ఉన్నప్పుడే తన తండ్రి పోడు భూమి నరుక్కొని దున్నుకుంటున్నాడన్నారు. ఇప్పటికే వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ఆదివాసీలకు పోడు భూములు జీవన సాంప్రదాయంగా వస్తుందన్నారు. దీన్ని ఎవరూ అడ్డుకోవడానికి లేదన్నారు.
చట్ట ప్రకారం అర్హులకు పట్టాలు ఇవ్వాల్సిందేనని వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ ఎస్టీలకు ఏం చేయలేదన్నారు. గులాబీ పార్టీ పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో? చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ఇక గత ప్రభుత్వంలో తమకు కానిస్టెన్సీ డెవలప్ మెంట్ కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇది దారుణమన్నారు. ఇప్పుడు బీఆర్ ఎస్ సభ్యులు సీడీఎఫ్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు.