స్పీడ్ పెంచిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహేశ్వరంలో హ్యాట్రిక్ కొట్టేనా?

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Update: 2023-11-14 02:48 GMT

దిశ, బడంగ్​పేట్​: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్​ఎమ్మెల్యే అభ్యర్థి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా తిరుగులేని విజయాల్ని సాధిస్తూ వచ్చారు. భర్త అకాల మరణంతో ఇంద్రారెడ్డి అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. అనతికాలంలోనే సబితా ఇంద్రారెడ్డి తన దైన ముద్ర వేశారు.

ఆనాడు దివంగత నేత, ఆంధ్రప్రదేశ్​మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి ‘చేవెళ్ల చెల్లమ్మ’ అంటూ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచి తన పాదయాత్రకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రిగా సక్సెస్​అయిన విషయం విదితమే. అనతి కాలంలోనే కీలకనేతగా ఎదిగిన సబితా ఇంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోంమంత్రిగా రికార్డుకెక్కారు. పునర్విభజన అనంతరం సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల నుంచి రెండు సార్లు, మహేశ్వరం నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎన్నికయ్యారు.

మహేశ్వరం నుంచి మూడో సారి హ్యాట్రిక్ కొట్టడానికి తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల మహేశ్వరం కాంగ్రెస్​అభ్యర్థి కేఎల్‌ఆర్‌తో పాటు బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు భారీగా నామినేషన్​ర్యాలీ నిర్వహించిన అనంతరమే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యర్థుల బలాబలాలను పరిశీలించాకే చివరగా నామినేషన్​చివరిరోజు నవంబర్ 10న అంతకు రెండింతలు మందితో భారీ నామినేషన్​నిర్వహించి విమర్శకుల నోళ్లు మూయించారు.

మంత్రిని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నప్పటికీ సబిత ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఇటీవలే బడంగ్‌పేట్‌కు చెందిన బీఆర్‌ఎస్​కీలక నేత కర్రె కృష్ణ, బడంగ్‌పేట్​మేయర్​చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కేఎల్‌ఆర్​సమక్షంలో చేరిన కొన్ని గంటలకే తిరిగి ప్రతి వ్యూహాలు రచించి కర్రెకృష్ణను బీఆర్‌ఎస్‌లోకి రప్పించారు. కనుసైగతో శాసించడం కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య.

అందెల, కేఎల్‌ఆర్‌ను ఇదివరకే ఓడించిన మంత్రి..

తన రాజకీయ చరిష్మాతో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తుచేయడంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిది అందెవేసిన చేయిగా చెప్పుకోవచ్చు. మంత్రిని ఢీకొట్టడానికి కాంగ్రెస్​ పార్టీ అధిష్ఠానం బలమైన నాయకుడు కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిని ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు రెండోసారి పోటీ చేస్తున్నారు. మంత్రిని ఈసారి ఎలాగైనా ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్​అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికల బరిలో దిగిన కేఎల్‌ఆర్‌తో పాటు అందెల శ్రీరాములు మంత్రితో ఢీకొట్టి ఓటమి చవిచూసిన నేతలే.

భర్త అకాల మృతితో 2000లో చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కేఎల్‌ఆర్‌పై 29,909 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2004లో సైతం చేవెళ్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిని 41,585 ఓట్ల మెజార్టీతో రెండో సారి ఓడించి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. వెంటనే వైఎస్‌ఆర్ సబితా ఇంద్రారెడ్డికి గనులు, భూగర్భ శాఖ అప్పగించి తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్​ కావడంతో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికల బరిలో దిగింది. తీగల కృష్ణారెడ్డిపై 8వేల ఓట్ల మెజార్టీతో మూడో సారి ఎమ్మెల్యేగా గెలుపొంది, దేశంలోనే మొదటి మహిళా హోంమంత్రిగా గుర్తింపు తెచ్చుకుంది.

సిట్టింగ్‌లను సైతం ఓడించిన సబితమ్మ..

సబితా ఇంద్రారెడ్డి రాజకీయ చతురతో సిట్టింగ్‌లను సైతం ఓడించారు. 2018 శాసన సభ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సబితా ఇంద్రారెడ్డి.. బీఆర్‌ఎస్​ సిట్టింగ్​ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డిని మట్టి కరిపించి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఎన్నికల్లో మొదటిసారి మహేశ్వరం నియోజకవర్గం అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అందెల శ్రీరాములును మట్టికరిపించారు. దీంతో మంత్రి చేతిలో కేఎల్‌ఆర్, అందెల శ్రీరాములు ఇదివరకే ఓటమిని చవి చూశారు.

ఇప్పటి వరకు రాష్ట్ర హోంశాఖామంత్రిగా, భూగర్భ గనుల శాఖా మంత్రిగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సైతం పనిచేసి తమ పదవులకే వన్నె తెచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షించి బీఆర్‌ఎస్​ పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఐదేళ్లలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజక వర్గ అభివృద్ధికి బాటలు వేశారు. మహేశ్వరంలో హ్యాట్రిక్​కోసం చూస్తున్న సబితా ఇంద్రారెడ్డికి గ్రామీణ ప్రాంతాల ప్రజలతో ఆమెకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు, అనుబంధం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ఆమె కుమారులు పటోళ్ల కార్తీక్​ రెడ్డి, పటోళ్ల కౌశిక్​రెడ్డి సైతం మైనార్టీల ఓట్లు కీలకంగా మారిన జల్‌పల్లి మున్సిపాలిటీలోనే తిష్ఠవేశారు. ఇప్పటికీ మంత్రి తనయులు మైనార్టీలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపుకోసం కృషి చేయాలని ఎంఐఎం పార్టీ సైతం మైనార్టీలకు సూచించిన విషయం తెలిసిందే. కీలకంగా మారే ఎన్నికల చివరి ఐదు రోజులు మంత్రి సబితమ్మ రాజకీయ చతురత ముందు ప్రత్యర్థులు నిలబడలేరని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈసారి మంత్రి సబితా మహేశ్వరం నుంచి హ్యాట్రిక్​కొట్టి ఐదోసారి ఎమ్మెల్యేగా మరో రికార్డును సొంతం చేసుకుంటుందా? లేదా ? వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News