సొంత నియోజకవర్గంలో మంత్రి సబితకు ఎదురుగాలి.. ఈసారి గెలుపు కష్టమేనా?
చేవెళ్ల చెల్లెమ్మగా పేరొందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: చేవెళ్ల చెల్లెమ్మగా పేరొందిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇలా ఎందుకంటే.. తమ అనుచరులు చేసే ఆగడాలకు అడ్డూ అదుపు లేదనే ప్రచారం ఉంది. మంత్రి పేరు చెప్పుకొని అధికార పార్టీ నేతలు కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువులు, కుంటల సుందరీకరణలో కూడా విస్తీర్ణం కుదించి కబ్జాలకు పాల్పడ్డారని ప్రజల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్లు లేకుండానే పనులు
బడంగ్‌పేట్, మీర్‌పేట్ మున్సిపాలిటీల్లో టెండర్లు లేకుండానే అధికార పార్టీలో ఒకే ఒక్కరు మంత్రి పేరుతో మున్సిపాలిటీ వర్క్స్చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మీర్‌పేట్ పరిధిలోని ఓ ప్రభుత్వ భూమిలో జూనియర్‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ స్థలంలో నిర్మించకుండా ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ పరిధిలో నిర్మించడం వెనుక కార్పొరేటర్ హస్తం ఉందనే టాక్. కార్పొరేటర్ తను కబ్జా చేసిన భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకేననే ఆరోపణలు లేకపోలేదు. ఇలా కబ్జాదారులను మంత్రి వెనకేస్తుకొస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలతో మంత్రి సబిత తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మహేశ్వరం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018లో కాంగ్రెస్‌నుంచి గెలిచి అధికార బీఆర్ఎస్‌లో చేరి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో మహేశ్వరం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి, వికారాబాద్‌జిల్లాలో తిరుగులేని లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నా మంత్రి సబితపై ఆరోపణలు, విమర్శలు వస్తుండగా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది.
ఆ రెండు వర్గాల నేతలూ దూరం
మహేశ్వరం సెగ్మెంట్‌లో 4 మండలాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో బీఆర్ఎస్‌కు వెన్నుదన్నుగా ఉన్న నేతలు క్రమంగా పార్టీకి దూరమవుతున్నారు. దీనికి కారణం మంత్రి తీరునే అని తెలుస్తుంది. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా వర్గవిభేదాలు రాకుండా నాయకులందరూ సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్పిలుపునిచ్చారు. నియోజవర్గంలో మాత్రం ఆ మాటకు ప్రాధాన్యత లేకుండాపోయింది. బీఆర్ఎస్‌లో మొదటి నుంచి పనిచేసిన కొత్త మనోహర్‌రెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టి మంత్రి కబ్జాలకు పాల్పడుతున్నారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం మంత్రి అనుచరులు కబ్జాలకు తెగబడుతున్నారని విమర్శలు చేశారు. ఇలా బీఆర్ఎస్ లోని నేతలే మంత్రిని ఇరకాటంలో పడేస్తున్నారు. తుక్కుగూడ మున్సిపల్ చైర్ పర్సన్బీజేపీ నుంచి, బడంగ్పేట్కార్పొరేషన్ చైర్మన్చిగురింత పారిజాత కాంగ్రెస్‌నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరి పదవులు చేపట్టారు. అనంతర పరిణామాలతో వీరిద్దరూ మంత్రి వైఖరికి వ్యతిరేకంగా తిరిగి సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.
సమన్వయం చేయకపోగా..
ఇంత జరుగుతుంటే మంత్రి సబిత మాత్రం సమీక్షించడం గానీ, సమన్వయం చేసుకొని పోవడం కానీ చేయడం లేదని తెలుస్తుంది. కేవలం క్షేత్రస్థాయిలోనే పనిచేసుకుంటూ పోతుంది. ఓ వైపు ప్రతిపక్షాలు.. మరో వైపు స్వపక్షంలోనే వ్యతిరేకులుండటం గమనార్హం. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి బరిలో ఉంటే ప్రజల ఆశీర్వాదిస్తారా? లేదా అనే సస్పెన్స్ నెలకొంది.
Also Read: ఉద్యోగాల భర్తీపై సర్కారు ప్రకటనలు.. ఆ లెక్కలపై నిరుద్యోగుల ఫైర్