Ponnam Prabhakar: కులగణనకు ఏర్పాట్లు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఘాటు విమర్శలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరెంత అరిచి గీ పెట్టినా రాష్ట్రంలో కులగణన చేయడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. క్యాస్ట్ సెన్సస్‌కు అంతా సిద్ధమని, ఇప్పటికే ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసిందన్నారు. రాహుల్‌గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేశామని, బీసీ కమిషన్‌ను నియమించుకుని క్యాస్ట్ సెన్సస్ కోసం అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారని చెప్పారు. ఇవాళ పీసీసీ మహేశ్‌కుమార్ గౌడ్‌కు హైదరాబాద్ రవీంద్రభారతిలో సోషల్ జస్టిస్-క్యాస్ట్ సెన్సస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కులగణన చేపట్టాలని అడిగితే రాహుల్‌గాంధీ జాతి ఏంటని బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కులగణనకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినా ఇదే పార్లమెంట్‌లో కులగణనకు తీర్మానం చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారన్నారు. కులగణన చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేన్నారు.
బలహీనవర్గాల వ్యతిరేక పార్టీ బీజేపీ
బీజేపీ బలహీనవర్గాలకు వ్యతిరేకమైన పార్టీ అని, ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని మంత్రి పొన్నం ధ్వజమెత్తారు. బలహీన వర్గాల ప్రజలు బీజేపీ అసలు స్వరూపం తెలుసుకోకపోతే రాబోయే తరాలకు నష్టం తప్పదన్నారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాజ్యాంగం ప్రకారం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉంటే క్రిమిలేయర్ పేరుతో ఇవి అమలు కాకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు న్యాయం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగే విధంగానే రిజర్వేషన్లు ఉంటాయన్నారు. ఐక్యంగా ఉండి బలహీనవర్గాలు విజయం సాధించేలా కలిసి పని చేయాలని మంత్రి ప్రభాకర్ పిలుపునిచ్చారు. తనతో పాటు వీహెచ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు వారసత్వ రాజకీయాల నుంచి కాకుండా క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి వచ్చారని, క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తేనే రాజకీయంగా ఎదుగుతామన్నారు. నిబద్ధతతో రాజకీయాల్లో క్షపడితే ఉన్న స్థానాలకు చేరవచ్చన్నారు. రాజకీయాల్లో ఎవరూ కుర్చీ వేయరని, మన హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కేలా మహేశ్‌కుమార్ గౌడ్ మార్గదర్శకత్వం వహించాలని, వారి వెంట తాము ఉంటామన్నారు.