రేషన్ కార్డును రెండు రకాలుగా విభజిస్తాం.. రాష్ట్ర మంత్రి సంచలన ప్రకటన

రేషన్ కార్డులను రెండుగా విభజిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-08-23 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: రేషన్ కార్డులను రెండుగా విభజిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేషన్ కార్డుగా, హెల్త్ కార్డుగా మారుస్తామని అన్నారు. రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ వెళుతున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ అమలు చేసి చూపించామని తెలిపారు. అది మాకు రైతుల మీదున్న చిత్తశుద్ధి అని వెల్లడించారు. మిగతా ఖర్చులను తగ్గించి రైతులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని.. తాము అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులను కంటికిరెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. గతంలో ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ రుణమాఫీ చేసిందని విమర్శించారు. అది కూడా సరిగా చేయలేదని.. రైతులను అనేక కష్టాలు పెట్టారని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని అన్నారు.


తాము బీఆర్ఎస్ నేతల్లా గోబెల్స్ ప్రచారం చేయడం లేదని తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వంలా ప్రచారం కోసం వేల కోట్లు తాము ఖర్చు చేయడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. హైడ్రాను మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చామని అన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలోని భూముల్లో నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది అని స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి స్థలాల్లో కట్టిన కట్టడాలను గుర్తిస్తున్నాం.. అవన్నీ కూల్చివేస్తాం అని అన్నారు. హిమాయత్ సాగర్ ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్ పరిధిలో తనకు ఫామ్‌హౌజ్ ఉందని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడడ్డారు. ఒకవేళ తనకు ఫామ్‌హౌజ్ ఉన్నది వాస్తవమే అయితే.. అది నింబంధనలకు విరుద్ధంగా ఉంటే.. కూల్చివేయాలని తానే అధికారులను ఆదేశిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.

Tags:    

Similar News