ఈ ఎన్నికల్లో ఆ ఇద్దరికి బుద్ధి చెప్పి తీరాల్సిందే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ బీజేపీ రావడం అసాధ్యమైన పని అని అన్నారు. మూడోసారి ప్రధాని కావాలని మోడీ కలలు కంటున్నారని.. కానీ, అవి కలలుగానే మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని మార్చడానికి పూనుకున్న బీజేపీకి, ఇందుకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నా బీఆర్ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో తాము బీఆర్ఎస్‌ను దగ్గరకు రానివ్వబోమని.. అందుకే కేసీఆర్ బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నాడని కీలక ఆరోపణలు చేశారు. నామా నాగేశ్వర రావును ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని చేస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం అని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ చేయాల్సిన దానికంటే ఎక్కువ రాచరికం చేశారని మండిపడ్డారు. అన్ని వర్గాలను నిండా ముంచారని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని.. తొమ్మిదేళ్లు కాలయాపన చేశారని విమర్శించారు. పోడు రైతులకు న్యాయం చేయాలంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు.